తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్లమలలో నాటుసారా రక్కసి.. చోద్యం చూస్తున్న ఆబ్కారీ శాఖ - నాగర్‌కర్నూల్ జిల్లాలో గుడుంబా దందా

Natu Sara in Nallamala : తినేందుకు తిండి సరిగా లేకున్నా... అడవి ఇచ్చే సంపదే పంచభక్ష పరమాన్నాలు. చెలిమెల ధారలే.... వారికి అమృత జలాలు. ప్రకృతి ఒడిలో తలదాచుకుంటూ... మూలికలతో వైద్యం చేసుకుంటూ... మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటారు.... ఆదివాసీలు. కల్మశంలేని సంబంధాలు.... అత్యంత స్వచ్ఛమైన వీరి జీవితాలను.... బుగ్గిపాలు చేస్తోంది.... రాకాసి నాటు సారా. పెద్దపులొచ్చినా ఎదురించే తెగువ.... తుపానొచ్చినా తట్టుకునే నల్లమలలోని చెంచుగూడాలు.... నాటుసారా దెబ్బకు మాత్రం మలమలమాడిపోతున్నాయి.

Natu Sara in Nallamala
Natu Sara in Nallamala

By

Published : Apr 5, 2022, 11:50 AM IST

నల్లమలలో నాటుసారా రక్కసి

Natu Sara in Nallamala : నాటు సారా... ఇళ్లకు ఇళ్లను, ఊళ్లకు ఊళ్లను కబళించే భూతం. గుడుంబా నిర్మూలనతోనే ప్రగతి సాధ్యమని భావించిన సర్కార్‌... రాష్ట్రంలో ఎక్కడికక్కడ నిర్మూలన చర్యలు చేపట్టింది. అయితే సర్కార్‌ సంకల్పం కేవలం పట్టణాలు, వాటికి చేరువలో ఉన్న గ్రామాల్లో నెరవేరినా.. మారుమూల ప్రాంతాల్లో మాత్రం గుట్టుచప్పుడు కాకుండా గుప్పుమంటూనే ఉంది.

దేశంలోనే అభయారణ్యాలలో అతిపెద్దదైన నల్లమల.. నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దఎత్తున విస్తరించి ఉంటుంది. అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మన్ననూరు ఐటీడీఏను ఏర్పాటు చేసింది. దీని కింద 8 మండలాల పరిధిలో 88 చెంచుగూడాలు ఉన్నాయి. ఈ గూడాల్లో 2వేల 595 కుటుంబాల్లో.. 8వేల 784మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని 12 చెంచుగూడేల్లో పూర్తిగా ఆదివాసీలు ఉండగా.. మిగతా చోట్ల ఆదివాసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలు కలిసి జీవిస్తుంటారు. అటవీ ప్రాంతాల్లో తేనే, వంట చెరుకు, నన్నారి గడ్డల సేకరణ, పశుపోషణతో పాటు ఇతర వన సంపదపై ఆధారపడి గిరిజనం జీవనం సాగిస్తుంటారు.

Natu Sara Danda in Nallamala : విద్య, వైద్యం, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేల్లో గుడుంబా రక్కసి కల్లోలం రేపుతోంది. చెంచుల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తోంది. మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఈ చెంచుగూడాల్లో గత ఐదేళ్లలో 499 మంది మృత్యువాత పడ్డారంటే.. నాటు సారా ఇక్కడి జీవితాలను ఏ స్థాయిలో నాశనం చేస్తుందో స్పష్టమవుతోంది. సారాయి కాటుకు చనిపోయిన వారిలో 325 మంది పురుషులుండగా.. 174 మంది మహిళలున్నారు.

"సారా తాగి తాగి ఆరోగ్యం పాడై మా నాన్న చనిపోయారు. మా అమ్మకు సారా తాగడం వల్ల క్యాన్సర్ గడ్డలైనయి. ఆ వ్యాధితో మా అమ్మ కూడా చనిపోయింది. నేనొక్కణ్నే మిగిలాను. మా ప్రాంతంలో చాలా మంది తమ తల్లిదండ్రులను, భర్తను, పిల్లలను కోల్పోయారు. సారా తాగడం వల్లే కాదు.. తాగుడుకు బానిసై మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుడుంబా మా గూడెంలో గుప్పుమంటోంది. కళ్ల ముందే మా వాళ్లు చనిపోతుంటే ఏం చేయలేకపోతున్నాం. దయచేసి అధికారులు మా గూడెంలో ఈ సారా మహమ్మారిని వెళ్లగొట్టాలి. మా బతుకులు మార్చాలి."

- గూడెం ప్రజలు

రెక్కాడితే కానీ డొక్కాడని ఈ ఆదివాసీల్లో చాలా మంది... రోజు వారీగా సంపాదించిన డబ్బును గుడుంబా కోసమే ఖర్చు చేస్తున్నారు. వీటికి అలవాటు పడిన వారు ఆరోగ్యంపై దృష్టి పెట్టడమే మానేశారు. అసలే పౌష్టికాహారానికి నోచుకోని వీరు... సారాకు బానిసవటంతో చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోతూ.... కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తమ గూడేల మనుగడ ప్రశ్నార్థంగా మారుతుందని ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు.

"సార్లపల్లిలో ఆడా మగ తేడా లేకుండా గుడుంబా సారాకు బానిసలవుతున్నారు. సరైన సమయానికి తిండి లేకపోవడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. వాళ్లెంత కష్టపడినా.. సారా వల్ల వారి బతుకులు మారడం లేదు. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు అనాథలుగా మారుతున్నారు. యువత కూడా గుడుంబాకు బానిసై వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వారి బంగారు భవిష్యత్‌ను చేజేతులా చిదిమేసుకుంటున్నారు."

- సరోజ,సబ్‌సెంటర్‌ అధికారిణి

Gudumba in Nallamala : హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ఆమ్రాబాద్‌ మండల పరిధిలోకి వచ్చే వటవర్లపల్లిలో.... ఈ నాటుసారా తయారీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక్కో ఇంట్లో నాలుగైదు బట్టీల ద్వారా గుడుంబాను ఉత్పత్తి చేస్తూ...పెద్ద ఎత్తున అక్రమ దందా సాగిస్తున్నారు. వటవర్లపల్లితో పాటు...మన్ననూరు, కొత్తపల్లి, పదర మండలంలోని జ్యోతినాయక్‌ తండా, చిన్నంపల్లి, బిక్లంగుంట, ఇప్పలంపల్లి...లింగాల మండలంలోని అప్పాయిపల్లి, లింగాల, దారారం...బల్మూరు మండలంలోని అంబగిరి, బాణాలలో గుడుంబా దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. విచ్ఛలవిడిగా దొరుకుతున్న నాటు మందుకు చిన్న వయసులోనే తాగుడుగు బానిసై... యువత జీవితాలు నాశనం చేసుకుంటుంది.

"సార్లపల్లి సర్పంచ్‌గా నేను రాజీనామా చేస్తున్నాను. సర్పంచ్‌గా నేను చేసిన తీర్మానాలకు విలువ ఇవ్వడం లేదు. మా ప్రాంతంలో గుడుంబా, సారా విచ్చలవిడిగా కాస్తున్నారని.. మా చెంచులు వాటికి బానిసై చనిపోతున్నారని అధికారులకు మొరపెట్టుకున్నాం. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నేను సర్పంచ్‌గా బాధ్యత చేపట్టినప్పటి నుంచి నా కళ్ల ముందే 30 మంది సారాకు బానిసై చనిపోయారు. వారి చావుని నేను ఆపలేకపోయాను. వారి కుటుంబాలు రోడ్డున పడుతుంటే చూస్తూ ఉండటం తప్ప ఏం చేయలేకపోతున్నాను. మా ప్రాంతంలో సారాను అరికట్టాలంటే నా ఒక్కడి వల్ల కాదు.. నాకు అధికారుల సాయం కావాలి. కానీ వాళ్లెవరూ మా గోడు పట్టించుకోవడం లేదు. మా చావు మమ్మల్ని చావమని వదిలేశారు. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను."

- మల్లికార్జున్, సార్లపల్లి సర్పంచ్

వారం కిందట నల్లమల్లలోని చెంచుగూడేల్ని గవర్నర్‌ పర్యటిస్తున్న వేళ... ఓ చెంచుగూడానికి చెందిన సర్పంచ్‌ ఇదే విషయమపై ఆందోళనకు గురై.. రాజీనామా పత్రాన్ని తమిళిసైకి సమర్పించటం చర్చనీయంగా మారింది. గుడుంబా రక్కసి కుటుంబాలను ఛిదిమేస్తున్న తీరును వివరిస్తూ... సార్లపల్లి సర్పంచ్‌ మల్లికార్జున్‌ గవర్నర్‌కు మొరపెట్టుకున్నారు. గుడుంబా తయారీని నిలిపివేయాలని ఎన్ని తీర్మాణాలు చేసినా ఫలితం లేదంటూ...గవర్నర్‌కు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఇదొక్క సారపల్లిలోనే కాదు..నల్లమల్లలోని అన్ని చెంచుపెంటల్లోనూ ఇదే పరిస్థితి. అయినప్పటికీ ఆబ్కారీ శాఖ చోద్యం చేస్తుందే తప్ప...కట్టడిపై మాత్రం దృష్టి సారించటంలేదని విమర్శలు వస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details