కొవిడ్ తో బాధ పడుతూ మరణించిన వారి మృతదేహలకు వారి సంప్రదాయల ప్రకారం ఇప్పటివరకు 36 మందికి అంత్యక్రియలు నిర్వహించిన యువకులకు మంత్రి నిరంజన్ రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి సొంతవాళ్లు కూడా భయపడుతున్నారు. ఎలాంటి రక్తసంబంధం లేకున్నా కరోనాతో చనిపోయిన మృతులకు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన అబ్దుల్ ఖాదర్, ఇమ్రాన్, గౌస్, ఖాజా ఉచితంగా అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకుంటున్నారు.
మతంతో సంబంధం లేదు.. మానవత్వమే ముఖ్యమంటున్న ముస్లిం యువకులు - ముస్లిం యువకుల మానవత్వం
కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులే భయపడుతున్న ఈ రోజుల్లో... నలుగురు ముస్లిం యువకులు కుల, మత భేదం అని తేడా చూడకుండా అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. వీరి సేవల గురించి తెలుసుకున్న మంత్రి నిరంజన్ రెడ్జి, కలెక్టర్ శర్మాన్ యువకులను అభినందించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన 36 మంది మృతదేహాలకు వారి సంప్రదాయాల ప్రకారం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని టీమ్ లీడర్ అబ్దుల్ ఖాదర్ మంత్రి నిరంజన్ రెడ్డికి వివరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అయినవారి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాని ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకుని అంత్యక్రియలు చేయడం గర్వించదగ్గ విషయమని వారిని మంత్రి కొనియాడారు. అంత్యక్రియలు నిర్వహించడం పట్ల మంత్రితో పాటు కలెక్టర్ శర్మాన్, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ యువకులను అభినందించారు. జిల్లాలో ఎక్కడైనా… కొవిడ్ మరణాలు సంభవిస్తే 9347250313 తన నెంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందజేస్తే ఎలాంటి రవాణా ఖర్చు లేకుండానే పూర్తిగా ఉచితంగానే వారి వారి ఆచారాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని టీమ్ లీడర్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు.