KTR Comments: కేంద్రం తెలంగాణపై అన్యాయం చేస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడుగల్‌లో రైతువేదికను ప్రారంభించారు. 40 రెండుపడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. అనంతరం నాగర్‌కర్నూర్ జిల్లాలో పర్యటించిన మంత్రి.. తిమ్మాజిపేటలో ఎంజేఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్మించిన ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల ఆకాంక్షను నేరవేర్చాం..
మన ఊరు- మన బడి కింద 26 వేల పాఠశాలల నవీకరణకు సంకల్పించినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విద్యా యజ్ఞంలో పూర్వ విద్యార్థులు, ప్రవాసంలో ఉన్న వారు కూడా భాగస్వామ్యం కావాలని కోరారు. రాష్ట్రంలో ఒక్కోక్కరికి రూ.1.20 లక్షల చొప్పున 5 లక్షల మందికి వెయ్యి గురుకులాల ద్వారా విద్య అందిస్తున్నామని కేటీఆర్ వివరించారు. దేశవ్యాప్తంగా 157 వైద్యకళాశాలలు, 8 ఐఐఎంలు, 16 ఐసర్లు, 100 నవోదయ విద్యాలయాలు ఇచ్చిన కేంద్రం... తెలంగాణకు మాత్రం ఇచ్చింది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది గిరిజన తండాలను సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా మార్చారని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న గిరిజనుల ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారన్నారు.