Mass marriages under MJR Trust: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామూహిక వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, వారి సతీమణి జమున రాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో జడ్పీ హై స్కూల్ మైదానంలో సామూహిక వివాహాలు ఏర్పాటు చేశారు. ఈ అపూర్వ వేడుకల్లో 220 జంటలు ఒక్కటయ్యాయి. సాంప్రదాయ పద్ధతిలో పెళ్లిళ్లు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులు ముందుండి పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు.
భారీగా వేసిన మండపాల్లో సుమూహూర్తాన 220 జంటలు ఒక్కటయ్యాయి. ఈ వేడుకలకు ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది ప్రజలు పెళ్లిని తిలకించేందుకు తరలివచ్చారు. ప్రజలందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. పెళ్లికి ముందు జంటలకు పట్టువస్త్రాలు, తాళి, మెట్టెలు అందించిన ట్రస్ట్ నిర్వాహకులు.. వివాహం అనంతరం జంటలకు బీరువా, మంచం, బెడ్‌తో పాటు ఇతర వంట సామగ్రి అందజేశారు.
ఈ సందర్భంగా రాజకీయాలతో సంబంధం లేకుండా పేదల సేవ కోసం ట్రస్ట్ స్థాపించానని ట్రస్ట్ అధినేత ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆడ బిడ్డల పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులు చూశానని.. తన ఇంట్లోనూ పేదరికాన్ని అనుభవించానని అన్నారు. ఇప్పటికే 485 జంటలకు సామూహిక వివాహాలు జరిపించానని వివరించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి.. ఇంత వైభవంగా వివాహాలు చేయడం అద్భుతమని ఎంపీ కేశవరావు పేర్కొన్నారు.
మర్రి జనార్దన్ రెడ్డి సేవలు ప్రశంసనీయని ఎంపీ నామ నాగేశ్వరరావు కొనియాడారు. ఇంత మంది పెళ్లిళ్లను ఒకేసారి చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ శాంతకుమారి, అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్దఎత్తున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.