Houses collapse: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిమిద్దెలు కూలిపోతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల గ్రామంలో ఓ మట్టిమిద్దె నేలమట్టమైంది. అయితే ఎవరూ లేకపోవడంతో పెద్దప్రమాదం తప్పింది. జిల్లాలోని కొల్లాపూర్ మండలం ఏన్మన్ బెట్ల, ఎల్లూరు, పానుగల్ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఏన్మన్ బెట్ల గ్రామానికి చెందిన పుట్ట ఎల్లయ్య ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని ఎల్లయ్య కుటుంబీకులు తెలిపారు. ఇంట్లో ఉన్న బియ్యం, నిత్యావసర వస్తువులు, టీవి, విలువైన వస్తువులు ధ్వంసమయ్యాయని వాపోయారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అధికారులు స్పందించి తమకు పునరావాసం కల్పించాలని బాధితులు వేడుకుంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గ్రామాల్లో పర్యటించారు. వారి కుటుంబాలను పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ మండలాల్లో చాలా గ్రామాల్లో ఏళ్ల కింద నిర్మించిన గృహల్లో ప్రజలు నివాసముంటున్నారు. సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పాశం నాగరాజు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.
ప్రభుత్వమే తమను ఆదుకోవాలి:రాష్ట్రంలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పలుచోట్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం దండేపల్లి, ఇందిరానగర్ గ్రామాల్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తమ ఇళ్లు కూలిపోయాయని ప్రభుత్వమే తమను అదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారికి స్థానిక పాఠశాల భవనాల్లో తాత్కాలిక వసతి కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.