Manjula Devi Excelling Priestly Profession: శుభకార్యాలు, గుడిలో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, హోమాలు ఇలాంటివి ఏవి జరిగినా పురోహితుడు తప్పనిసరి. పురోహితులంటే అంతా పురుషులే. మహిళలు అరుదుగా పౌరోహిత్యం చేస్తున్నాఆదరించే వాళ్లు తక్కువ. అలాంటిది 26 ఏళ్లుగా పౌరోహిత్యంలో కొనసాగుతూ అందరి మన్ననలు అందుకుంటున్నారు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బైరాపూర్‌కు చెందిన మంజులాదేవి.
మంజుల స్వస్థలం ఊర్కొండ మండలం రేవల్లి. తొమ్మిదో తరగతి వరకూ కల్వకుర్తిలోనే విద్యాభ్యాసం చేశారు. 1972లో కర్ణాటక రాష్టానికి చెందిన కృష్ణమూర్తితో వివాహం జరిగింది. వెల్దండ మండలం రాచూరులో కాపురం పెట్టారు. భర్తకు తెలుగు తెలియకపోవడం, పౌరోహిత్యం రాకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఈ నేపథ్యంలో అమె గ్రామంలో.. ప్రైవేటు ఉపాధ్యాయురాలిగా, విద్యావాలంటీరుగా, టైలర్‌గా పనిచేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏవీ ఆమెకు అచ్చిరాలేదు.
వివిధ పూజాది కార్యక్రమాల్ని ఎలా చేయాలో నేర్చుకున్నారు:ఆ సమయంలో తనకున్న అనుభవంతో మంజులాదేవి.. సర్పంచ్ ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. దానిని చూసి మెచ్చిన గ్రామస్తులు శుభకార్యాల కోసం ఆమె దగ్గరికే రావడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో పంచాంగం, మూహుర్త నిర్ణయం సహా పెళ్లిళ్లు, వ్రతాలు, హోమాలు, గృహప్రవేశాలు లాంటి పూజాది కార్యక్రమాల్ని ఎలా చేయాలో నేర్చుకున్నారు మంజులాదేవి. పెద్దకుమారుడు బైరాపూర్ లోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. ఆయన కుటుంబంతో సహా హైదరాబాద్‌కు మారడంతో గుడికి పూజారి లేకుండా పోయారు. బైరాపూర్ దేవాలయంలోనూ కొద్దిరోజులు పూజారిగా కొనసాగారు.
బైరాపూర్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలు.. ఆమెను పురోహితురాలిగా శుభకార్యాలకు పిలిచేవారు. అలా గ్రామస్తుల ఆదరణ సంపాదించారు. వచ్చిన సంపాదనతో కూతురి వివాహం కూడా చేశారు. మహిళగా పౌరోహిత్యం చేస్తామంటే ఆమెను వ్యతిరేకించిన వాళ్లూ లేకపోలేదు. అయినా మంజులాదేవి వెనక్కి తగ్గలేదు. కాశీలోనూ మహిళలు పౌరహిత్యం చేస్తుండగా తాను చేస్తే తప్పేంటని ముందుకు సాగారు. ఎలాంటి శుభకార్యమైనా శాస్త్రబద్ధంగా నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు.