నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకల్‌లోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా మల్లేశ్ విధులు నిర్వర్తిస్తున్నాడు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు వ్యాయామంలో మెళకువలు నేర్పుతున్నాడు. పిరమిడ్లు వేయటంలోనూ అత్యుత్తమ శిక్షణ ఇస్తున్నాడు. జిల్లాలో జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రదర్శనలు ఇస్తూ.... తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. వివిధ అవార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నాడు.
ధ్యాన్‌చంద్ ఫిజికల్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాడు. సుమారు ఇప్పటివరకు 600 రకాల పిరమిడ్లు వేశాడు. ఒక్కో పిరమిడ్‌కు సుమారు 15 మంది విద్యార్థులు అవసరం ఉంటుంది. పిరమిడ్లు వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని.. మానసికంగానూ విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారని మల్లేశ్ చెబుతాడు. చదువుల్లో ప్రోత్సహిస్తూనే.... క్రీడల్లో రాణించేలా కృషి చేస్తున్నామని తెలిపాడు.