ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని స్పిన్నింగ్ మిల్లుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉత్పత్తిని కొనేవారు లేక.. పరిశ్రమల నిర్వహణ భారంగా మారుతోంది. కార్మికులకు జీతాలూ ఇవ్వలేని స్థితిలో పరిశ్రమను నిర్వహించాలా, వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు నిర్వాహకులు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి కేంద్రంలోని సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో సుమారు 2 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరందరికీ ఇదే ఆధారం. కరోనా పుణ్యమా అని ప్రస్తుతం ఈ మిల్లు సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం 2 వేల టన్నుల ఉత్పత్తి గోడౌన్లో మూలుగుతోంది. ఉత్పత్తిని అమ్మితేనే పరిశ్రమకు ఆదాయం. ఆదాయం లేదంటే పరిశ్రమను నిర్వహించం భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో యాజమాన్యం మిల్లును నడపాలా, వద్దా అనే సందిగ్ధంలో పడింది.
40 శాతం ఉత్పత్తి మాత్రమే..
లాక్డౌన్ వల్ల వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లడం వల్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం 40 శాతం ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. దారాన్ని తయారు చేసినా.. కొనుగోళ్లు జరుగుతాయో, లేదో తెలియని సందిగ్ధంలో నిర్వాహకులూ ఉత్పత్తిని తగ్గించారు. కరోనా ప్రభావం ఇలాగే కొనసాగితే మిల్లులు నడిచే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.