Palamuru Praja Bheri in Nagar Kurnool: ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ తర్వాత నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో అగ్రనేతలతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. 'పాలమూరు ప్రజాభేరి' అనే పేరును ఈ బహిరంగ సభ కోసం ఖరారు చేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేతలు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కొల్లాపూర్ వేదికగా జరిగే పాలమూరు ప్రజాభేరిలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి ఏ పార్టీ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
'పాలమూరు గడ్డ.. పేదోడి అడ్డా.. దాడులు చేస్తూ ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు'
BJP leader Join in Congress Party :మహబూబ్ నగర్ జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మహబూబ్‌నగర్ కీలకమైంది. ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన బీజేపీ రాష్ట్రనేత ఒకరు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం సాగుతోంది. దేవరకద్ర నియోజకవర్గంలోనూ గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న నియోజక వర్గ నేత చేరికపైనా ఊహాగానాలు జోరందుకున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జడ్చర్ల నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.