నాగర్కర్నూల్ జిల్లాలోని కేసరిసముద్రం చెరువులో కాస్త నీళ్లు తగ్గాయో లేదో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో మళ్లీ ఆక్రమణలు మొదలయ్యాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో మోటార్ల మునకతో కొద్దిరోజుల పాటు నీటి సరఫరా నిలిచింది. సాగు భూములకు నీళ్లు వదలడంతో కేసరిసముద్రం చెరువులో నీళ్లు తగ్గాయి. ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్న అక్రమార్కులు.. వెంటనే తమ ప్లాన్ అమలు చేస్తున్నారు.
కేసరి చెరువు శిఖం భూముల ఆక్రమణ తేలడమే ఆలస్యం
ఎఫ్టీఎల్ పరిధిలో మునిగిపోయిన ప్లాట్లు బయటకు తేలాయి. వెంటనే చెరువు ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. చెరువులోకి మళ్లీ నీళ్లొచ్చినా.. పైకి రాకుండా అందులో మట్టి, ఇటుకలు, రాళ్లు, మొరం తీసుకువచ్చి గుట్టలుగా పోస్తున్నారు.
కేసరి చెరువు శిఖం భూముల ఆక్రమణ మట్టిపోస్తే కఠిన చర్యలే
ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాటిలో మట్టికుప్పలు తెచ్చిపోస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్కర్నూల్ నీటిపారుదల శాఖ డీఈ రమేశ్ హెచ్చరించారు. మళ్లీ మట్టికుప్పలు పోసినట్లుగా తమ దృష్టికి రాలేదని తెలిపారు. చెరువును పరిశీలించి మట్టిపోసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇళ్ల స్థలాలు కొని మోసపోయారు
చెరువు వెంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేశారని నీటిపారుదల శాఖ, పురపాలక సంఘం అధికారులు 31 మందికి నోటీసులు జారీ చేశారు. చెరువు నిండినప్పుడు కొన్ని ఇళ్లు నీటిలోనే ఉండిపోయాయి. కొన్ని చోట్ల అనుమతి లేకుండా నిర్మాణాలు చేశారు. అలుగు నుంచి ఉయ్యాలవాడ వరకు కొన్నిచోట్ల నిర్మాణాలు జరిగాయి. చెరువు పూర్తిస్థాయిలో నింపడం వల్ల నిర్మాణాలు ఆగిపోయాయి. చెరువు వెంట చాలామంది తెలియక ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి మోసపోయారు. ఇప్పుడు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నవన్న కారణంగా ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభించకపోవడం వల్ల లబోదిబోమంటున్నారు.
ఆ స్థలాలకు అనుమతులివ్వం
నాగర్కర్నూల్, నాగనూల్ చెరువు వెంట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఉన్న స్థలాలకు ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ఆక్రమణలు ఉంటే తొలగిస్తాం. నీటిపారుదల శాఖ చేసిన సర్వే ప్రకారం నోటీసులు ఇచ్చాం. అక్రమంగా నిర్మాణాలు చేపడితే చెరువు నిండిన తర్వాత నీరు వచ్చి ఇబ్బందులు పడతారు. చెరువు వెంట ఇళ్ల స్థలాలు తీసుకునే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవాటికి అనుమతులిచ్చే అవకాశం లేదు.
- అన్వేశ్, పురపాలక కమిషనర్, నాగర్కర్నూల్