JP Nadda Telangana Tour Latest Updates : మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా.. నాగర్‌కర్నూల్‌లో జరిగిన నవసంకల్ప బహిరంగసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. 9 ఏళ్ల మోదీ సర్కార్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కిసాన్ సమ్మాన్ నిధి, గరీబ్ కల్యాణ్ యోజన, పీఎం ఆవాస్ యోజన ద్వారా అభివృద్ధిలో సరికొత్త చరిత్ర సృష్టించామని గణంకాలుసహా వివరించారు.
JP Nadda Fires on BRS : ఎన్‌డీఏ పాలనలో పేదరికం, అతిపేదరికం తగ్గిందని జేపీ నడ్డా తెలిపారు. మనం వాడుతున్న సెల్‌ఫోన్లలో 97శాతం భారత్‌లోనే తయారవుతున్నాయని.. ఆటోమైబైల్ రంగంలో జపాన్‌తో పోటీపడుతున్నామని పేర్కొన్నారు. దేశం ఒకవైపు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే కేసీఆర్ పాలన వల్ల తెలంగాణ వెనుకబడిపోయిందని జేపీ నడ్డా విమర్శించారు.
"గతంలో భారత్ ప్రధాని అమెరికా వెళ్తే ఉగ్రవాదం, పాకిస్థాన్, కశ్మీర్ పైనే చర్చ జరిగేది. ఇప్పుడు మోదీ అమెరికా వెళ్తే పాకిస్థాన్‌పై కాకుండా అభివృద్ధిపైనే చర్చ జరిగింది. ఇది పరివర్తనం చెందుతున్న భారత్. తెలంగాణను నాశనం చేసేందుకు కేసీఆర్ ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిపథంలో సాగితే.. తెలంగాణ అభివృద్ధిలోనూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు. తెలంగాణలో 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించాం. అంటే లద్దాక్ నుంచి తెలంగాణ, తెలంగాణ నుంచి లద్దాక్ మధ్య దూరం స్థాయిలో తెలంగాణకు జాతీయ రహదారులు ఇచ్చాం. హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఇదేతరహాలో మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇవన్నీ మోదీ మంజూరు చేసినవే. ప్రగతిలో సరికొత్త చరిత్ర లిఖించారు." - జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు
BJP Government Development works in Telangana :కేసీఆర్ అనుచరుల జేబులు నింపుతున్న ధరణి, బీఆర్ఎస్పోర్టల్‌ను బంద్ చేయిస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. తెలంగాణ ప్రజల శక్తి, సామర్థ్యాలను పట్టించుకోకుండా కేసీఆర్ తన కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని ఆయన విమర్శించారు.