ISSUES AT DIALYSIS CENTRE: నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 2018లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో కిడ్నీలు పాడై ఇబ్బందులు పడుతున్న రోగుల సౌలభ్యం కోసమే ప్రతి జిల్లా కేంద్రాల్లోనూ డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో రోజురోజుకు డయాలసిస్ రోగులు పెరిగిపోతుండడంతో ఐదు పడకల డయాలసిస్ కేంద్రం ఏ మాత్రం సరిపోవడం లేదు.
డయాలసిస్ కేంద్రంలో రోగులకు రక్తం శుద్ధి చేయడానికి మొత్తం 5 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో నాలుగు పడకల్లో సాధారణ రోగులకు రక్తం శుద్ధి చేస్తున్నారు. మిగిలిన ఒక పడకలో హెచ్‌సీబీ, హెచ్‌సీఎస్ వైరస్ ఉన్న రోగులకు కేటాయించారు. జిల్లాలో ఒకే డయాలసిస్ కేంద్రం ఉండటంతో కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల ప్రాంతాల రోగులు నుంచి వస్తున్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ ఆసుపత్రిగా మార్చడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు రక్తశుద్ధి కేంద్రంలో రోగులకు మెరుగైన సేవలు అందించడానికి పడకల స్థాయిని పెంచాలని బాధితులు కోరుతున్నారు. జిల్లా మొత్తంగా 53 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. ఒక్కో రోగి వారంలో రెండు, మూడుసార్లు రక్తం శుద్ధి చేయాల్సి ఉంటుంది.