Dalit Bandhu scheme in Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా చారగొండ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన దళితబంధులో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. మండలంలోని ప్రతి గ్రామంలోని దళిత కుటుంబాల్ని గుర్తించి రూ.9 లక్షల 90 వేలు మంజూరు చేశారు. ఈ మేరకు 1708 యూనిట్లు మంజూరు కాగా 1601 యూనిట్లను లబ్ధిదారులకు అందించారు. తమకు దక్కాల్సిన 10 లక్షల విలువైన యూనిట్లు అందలేదని లక్షా 30వేలు మధ్య దళారుల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. తొలుత పశువులు, డైరీ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు షెడ్లు నిర్మించుకున్నారు. యూనిట్లు మార్చుకుంటే నేరుగా డబ్బులే ఇస్తామని చెప్పిన దళారులు దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షలు తీసుకుని కేవలం 8లక్షలే ముట్టజెప్పారని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు .
లబ్ధిదారులకు నాసిరకం పరికరాలు: వాస్తవానికి దళితబంధు ద్వారా వచ్చిన డబ్బుతో యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సింది పోయి దళారుల చేతివాటంతో చాలీచాలని సొమ్ముతో చాలా మంది స్థలాలు కొనుగోలు చేశారు. మర్రిపల్లి తండాలో దళితబంధు కింద ఇచ్చిన ట్రాక్టర్లు, టెంట్ హౌజ్, సెంట్రింగ్ పరికరాలు నాసిరకంగా ఉన్నాయని లబ్దిదారులు ఆరోపిస్తున్నారు. ముందు నాణ్యమైన ట్రాక్టర్లు చూపించి, ఆ తర్వాత నాసిరకానివి ఇచ్చి చేతులు దులుపుకున్నారని లబోదిబోమంటున్నారు. దమ్ము చక్రాలు లేక ట్రాక్టర్లను ఇంటి ముందు అలంకార ప్రాయంగా పెట్టుకున్నామని మర్రిపల్లి తండాలోని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.