Insect Pests of Kolhapur Mango: ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా మామిడి తోటలున్న ప్రాంతం కొల్లాపూర్. కొల్లాపూర్ ప్రాంతంలో పండే మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయిన మామిడి దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 32,000 ఎకరాల్లో మామిడి సాగైతే.. అందులో 22,000 ఎకరాలు కొల్లాపూర్ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి.
మూడేళ్లుగా నష్టాల ఊబిలో అన్నదాతలు: ఏటా లక్షా 28వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తే.. అందులో 52,000 మెట్రిక్ టన్నుల వరకూ కొల్లాపూర్ నుంచే ఉత్పత్తి అవుతాయి. సుమారు 10,000 మంది రైతులు.. బేనేషాన్, దశేరి, కేసరి, హిమాయిత్, రసాల్, తోతాపురి రకాలను సాగుచేస్తారు. అంతటి ప్రాధాన్యమున్న మామిడిని పండిస్తున్న అన్నదాతలు మాత్రం మూడేళ్లుగా నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారు. కారణం మామిడిని ఆశిస్తున్నతెగుళ్లు. గతేడాది తామర పురుగు దాడి చేయడంతో.. పూత, కాత లేక దిగుబడులు సగానికి పైగా పడిపోయాయి.
కాయలు లేక వెలవెలబోతున్న తోటలు: అంతకుముందు సంవత్సరం కొవిడ్ కారణంగా డిమాండ్ లేకుండా పోయింది. ఈ ఏడాది పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. చూస్తే పచ్చగా, తెల్లని పూతతో కనిపిస్తున్న తోటలు. కాయలే లేక వెలవెలబోతున్నాయి. పురుగు మందులమ్మే వ్యాపారులు, ఉద్యాన అధికారులు ఎన్నిరకాల మందులు సూచించినా.. దేనికీ తెగుళ్లు నియంత్రణలోకి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఏడాది తోటలు తీసేయక తప్పదు:పురుగుమందుల కోసం ఇప్పటికే లక్షలు ఖర్చు చేశామని.. బకాయిలు పెరిగి చివరికి వ్యాపారులు సైతం పురుగు మందులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని రైతులంటున్నారు. తామర పురుగు ఉద్ధృతిని తగ్గించే మందులు కనిపెట్టలేకపోతే.. వచ్చే ఏడాది తోటలు తీసేయక తప్పదని అభిప్రాయపడుతున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో సొంతంగా తోటలు సాగుచేసే వాళ్లకంటే.. కౌలురైతులు సాగుచేసే విస్తీర్ణమే ఎక్కువ. వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.