ఆధునిక పద్ధతిలో విభిన్నమైన తోటలను సాగుచేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాల గ్రామ రైతులు. భూమి ఉన్నా... నీటి వనరులు సరిగా లేకపోవటం వల్ల తక్కువ నీటితో లాభాలు గడించే పంటలు వేసి లాభాలు గడిస్తున్నారు. గ్రామంలో రైతులు దశాబ్దకాలంగా బొప్పాయి సాగు చేస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. గ్రామంలో 150 ఎకరాలకు పైగా బొప్పాయి పంట సాగు చేస్తున్నారంటే.. రైతులు ఎంతగా రాణిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ పంటలో ఆశించిన లాభాలు రావడం వల్ల ఇతర తోటల సాగునూ రైతులు ప్రారంభించారు.
ఉద్యాన పంటలకు శ్రీకారం...
గ్రామానికి చెందిన రాజేందర్ రెడ్డి అనే రైతు తనకున్న 10 ఎకరాల భూమిలో పందిరి ఏర్పాటు చేశారు. అందులో కాకర, బీర, చిక్కుడు వంటి పంటలు పండిస్తున్నారు. వీటితో పాటు అదనంగా తన పొలంలోనే కొలను నిర్మించి చేపల పెంపకం, నాటు కోళ్ల పెంపకం చేపట్టాడు. పక్కనే ఉన్న పలువురు రైతుల భూమిని కౌలుకు తీసుకొని సుమారు 23 ఎకరాల్లో బొప్పాయి సాగు చేశాడు. ఎకరాకు సుమారు రూ 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నాడు. ఈ సారి కొవిడ్ వల్ల బొప్పాయికి కాస్త గిరాకీ తగ్గిందని... సాధారణ రోజుల్లో మంచి ఆదాయం వస్తుందని రాజేందర్రెడ్డి చెబుతున్నాడు.