నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కోడేరు మండలం బావాయిపల్లి వాగు పొంగిపొర్లుతోంది. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు వాహనంతో పాటు కొట్టుకు పోతుండగా గ్రామస్థులు వారిని తాడు సాయంతో కాపాడారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్ధృతంగా వాగులు, వంకలు
ఎడతెరపిలేకుండా కొల్లాపూర్ నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాకపోకలు ఆగిపోయాయి. వేరే గ్రామాలకు వెళ్లే క్రమంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణాలు చేస్తూ పలువురు ప్రమాదాలకు గురవుతున్నారు.
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉద్ధృతంగా వాగులు, వంకలు
కొల్లాపూర్ మండలంలో కుడుముల వాగు, నార్లాపూర్ పెద్ద వాగులు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముక్కిడిగుండం గ్రామంలో 4 ఇళ్లు, పూరి గుడిసెలు కూలిపోయాయి. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గోపాల్ దిన్నె రిజర్వాయర్ అలుగు పోయడంతో గోవర్ధనగిరికి వీపనగండ్ల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.