రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని... మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి అన్నారు. నిరుద్యోగులను తెరాస ప్రభుత్వం మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాలపరిమితి ముగిసినా ఇంకా కొత్త కమీషన్ను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. నాగర్కర్నూల్, అచ్చంపేట పట్టణాల్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సన్నాహాక సమావేశంలో.. మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.
తెరాస మాట తప్పింది...
నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి... తెరాస ప్రభుత్వం మాట తప్పిందని చిన్నారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉద్యోగాల భర్తీ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. తెరాస పాలనలో చేసిందేమీ లేదన్నారు.