తెలంగాణ

telangana

ETV Bharat / state

గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్‌ తమిళిసై

Governor tamilisai tour:ఆదివాసి గిరిజన చెంచు తెగల అభ్యున్నతి కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఆమె దత్తత తీసుకున్న అప్పాపూర్ చెంచుపెంటలో పర్యటించారు. చెంచుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రభుత్వం ద్వారా అందే అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చెంచులకు కూడా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం దత్తత తీసుకున్న గ్రామాలే కాకుండా తమ సేవలను మరిన్ని ఆవాసాలకు విస్తరిస్తామని ఆమె వెల్లడించారు.

Governor tamilisai tour
Governor tamilisai tour

By

Published : Mar 26, 2022, 3:26 PM IST

Updated : Mar 26, 2022, 7:17 PM IST

నాగర్‌కర్నూల్‌ పర్యటనలో గవర్నర్‌... ఆదివాసీలకు కీలక సలహాలు

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నే చెంచులకు అందేలా కృషి చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నాగర్ కర్నూల్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అప్పాపూర్ గ్రామాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా అప్పాపూర్‌లో గవర్నర్ ప్రత్యేక నిధులతో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. హెల్త్ స్కానింగ్, మహిళలకు కుట్టు మిషన్ కేంద్రం, ఆశ్రమ పాఠశాలలో తాగు నీటికి సోలార్ పంప్ సెట్, అప్పాపూర్, భౌరాపూర్ పెంటలకు రెండు ద్విచక్ర వాహన అంబులెన్స్, కమ్యూనిటీ షెడ్ ప్రారంభించారు. మహిళలకు హైజినిక్ కిట్లు, ఇప్ప పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసిన పోషక విలువలు గల లడ్లు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, స్టడీ మెటీరియల్ అందజేశారు.

మరిన్ని పెంటలకు సేవలు:దట్టమైన అడవిలో నివసించే చెంచులను కలుసుకోవడం వల్ల తన జీవితం ధన్యమైందని ఇదో మధుర జ్ఞాపకంగా ఉండిపోతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాష్ట్రంలో ఆదివాసీలు ఉన్న నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్త గూడెం, ఆదిలాబాద్ జిల్లా నుంచి 6 గ్రామాలను గతంలో దత్తత తీసుకున్నట్లు గుర్తు చేశారు. ఆదివాసీల ఆరోగ్యంపై ఆందోళనగా ఉంటుందనీ.. ఆరోగ్యవంతులుగా ఉండాలని, మంచి పోషకాహారం తీసుకొని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని చెంచులకు సూచించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెంటలకు సేవలు విస్తరిస్తామని తెలిపారు.

గతంలోనే 6 గ్రామాల దత్తత:గవర్నర్ దత్తత తీసుకున్న 6 గ్రామాలకు ఒకటిన్నర కోట్ల నిధులను కేటాయించినట్లు గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. ఆదివాసీల సమీకృత అభివృద్ధికి రెడ్​క్రాస్, ఎన్‌ఐఎన్, ఇతర సంస్థల ద్వారా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అప్పాపూర్, బౌరాపూర్ పెంటల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూ. 49.90 లక్షల చెక్కును గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్‌కు అందజేశారు. గవర్నర్ చెంచు పెంటలను దత్తత తీసుకున్న తర్వాత ఆయా గ్రామాలకు ద్విచక్ర వాహన అంబులెన్స్, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ కనెక్షన్, మిషన్ భగీరథ ఇంటింటికి తాగు నీరు, ఐటీడీఏ ద్వారా గిరిపోషణ పౌష్టికాహారం, ఇళ్ల మరమ్మతులు చేయించడం జరిగిందని కలెక్టర్ ఉదయ్ కుమార్ వివరించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్నందున కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు.

సార్లపల్లి సర్పంచ్ రాజీనామా: అప్పాపూర్‌లో గవర్నర్ తమిళసైతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమ్రాబాద్ మండలం సార్లపల్లి సర్పంచ్ మల్లికార్జున్ తాను సర్పంచు పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఏజెన్సీలోని గ్రామసభల తీర్మానాలను విలువ లేదని ఆరోపించారు. ఈ మేరకు గవర్నర్‌కు రాజీనామా లేఖను అందిస్తున్నట్లు చెప్పారు. చెంచుగూడల్లో గుడుంబా ఎరులై పారుతుందని, సారా తాగి చెంచులు అనారోగ్యబారిన పడి చనిపోతున్నారని ఆరోపించారు. చెంచు పంచాయతీల పీసా చట్టం సక్రమంగా అమలు కావడం లేదన్నారు.

చెంచులకు సేవ చేయడం సంతోషంగా భావిస్తున్నా... చెంచుల ఆరోగ్యం, జీవన స్థితి బాగుపడేలా చర్యలు తీసుకుంటాం. ఔషధాల పంపిణీ, ఆస్పత్రుల్లో వసతులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాము. చెంచులు పౌష్టికాహారం తీసుకోవాలి. గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మన్ననూరులోని ఇతర ఆవాసాలకు మా సేవలు విస్తరిస్తాం.

- తమిళిసై సౌందరరాజన్‌, గవర్నర్‌

ఇదీ చూడండి:Paddy Procurement: 'ఉగాది తర్వాత కేంద్రంపై ఉద్ధృత పోరాటం'

Last Updated : Mar 26, 2022, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details