తెలంగాణ

telangana

ETV Bharat / state

'చెట్టు కొట్టేస్తారా.. భరతం పట్టిన బాలుడు' - Article on Sivakumar

కళ్లముందే ఏళ్లనాటి వృక్షాలన్ని కొట్టివేస్తుంటే ఏం చేస్తారు.... ? చాలా మందైతే ఏం పట్టనట్లుగా చూస్తూ వెళ్తుంటారు. కొందరైతే ఎందుకు కొట్టేస్తున్నారని ప్రశ్నిస్తారు. మరికొందరు వీలైతే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. రోడ్డు పక్కన ఉన్న ఓ మహావృక్షాన్ని నరుకుతుండటాన్ని చూసి తల్లడిల్లిపోయాడు... ఓ బాలుడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్‌లో ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న అధికారులు... చెట్టును నరుకుతున్న వారికి భారీ జరిమానా విధించారు. బాధ్యతాయుతంగా బాలుడు వ్యహరించిన తీరుకు ఏకంగా గవర్నర్ స్పందించి... అతన్ని ప్రత్యేకంగా అభినందించారు.

Governor tamilisai praises to the boy who acted responsibly
Governor tamilisai praises to the boy who acted responsibly

By

Published : Mar 22, 2021, 9:42 AM IST

'చెట్టు కొట్టేస్తారా.. భరతం పట్టిన బాలుడు'

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తికి చెందిన బేగిని శివకుమార్‌... పదో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో... హైదరాబాద్‌లో ఉండే మావయ్య ఇంటికి వెళ్లిన శివ... మార్గమధ్యలోరోడ్డు పక్కన కొందరు వేపచెట్టును నరుకుతుండటాన్ని గమనించాడు. నేరుగా వెళ్లి వారికి చెబితే వినేలా లేరు. వారిని అడ్డుకునే శక్తీ తనకు లేదు. వెంటనే మావయ్యకు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లమని... ఆయన నంబర్‌ ఇచ్చారు. చెట్టునరికే వారిని నేరుగా అడ్డుకోలేకపోయిన బాలుడు.... ఏమాత్రం ఆలస్యం చేయకుండా అధికారులకు ఫోన్‌చేసి, చెట్టును కొట్టేస్తున్న ప్రాంతం వివరాలు తెలిపాడు. కానీ అధికారులు వెళ్లే సరికే ఆ చెట్టును నరికేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి రూ.62,075 జరిమానా విధించారు.

గవర్నర్ ప్రశంసలు

సామాజిక మాధ్యమాల వేదికగా చాలా మంది శివకుమార్‌ను అభినందించారు. బాలుడు బాధ్యతాయుతంగా వ్యవహరించిన తీరును తెలుసుకున్న గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌.... శివకుమార్‌, అతని తల్లిదండ్రులను రాజ్‌భవన్‌కు పిలిపించారు. ఈ సందర్భంగా బాలుడికి అభినందనలు తెలిపిన గవర్నర్‌... జ్ఞాపిక, శాలువాతో సన్మానించి, ఆక్స్‌ఫర్డ్‌ నిఘంటువును బహుమతిగా ఇచ్చారు.

అదే తన లక్ష్యం

అతడు ఆ చెట్టును కాపాడలేకపోయినా.. వృక్షాలను ఎలా రక్షించాలో చాలామందికి శివకుమార్‌ దారి చూపాడు. భవిష్యత్తులో సైన్యంలో చేరి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవటమే తన లక్ష్యమంటున్న శివ.... గవర్నర్ ప్రశంస తన బాధ్యతను మరింత పెంచిందని అంటున్నాడు.

ABOUT THE AUTHOR

...view details