జిల్లాలో విస్తారంగా సాగుచేసిన వరిధాన్యం కొనుగోలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రాకతో సాగునీరు సమృద్ధిగా లభించడం ఈసారి నాగర్ కర్నూల్ జిల్లాలో రబీ సాగు విస్తారంగా పెరిగింది. ప్రస్తుతం పంట చివరి దశలో ఉంది. ఏప్రిల్ మొదటి వారంలోనే కోతలు పూర్తయి ధాన్యం మార్కెట్కు చేరుకుంటుంది. ముందుగా వరి కోతలు చేసే రైతులు ధాన్యం తక్కువ ధరలకు దళారులకు అమ్ముకొని నష్టపోకుండా.. ముందస్తుగానే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వచ్చే నెల మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడం కోసం పౌర సరఫరాల శాఖ అధికారులు వారం కిందటే రైసు మిల్లుల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
రైతుల నుంచి దాదాపు 1,44,859 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాలశాఖ అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకు జిల్లాలోని 20 మండలాల్లో ఐకేపీ ఆధ్వరంలో 15, మెప్మా ఆధ్వర్యంలో 3, సింగిల్‌విండో ఆధ్వర్యంలో 49 మొత్తం కలిపి 67 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.