నాగర్ కర్నూల్ జిల్లా తూడుకుర్తి గ్రామంలో వడ్డే రాములుకు మూడు రోజుల క్రితం కొవిడ్ పాజిటివ్ వచ్చింది. గత మూడ్రోజులుగా అతను హోం ఐసోలేషన్లో ఉంటున్నాడు. ఇంట్లోకి బయట వారెవరూ రాకపోవడం, ఒంటరిగా ఉండడం, తనకేమైపోతుందోనన్న భయంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకొని రాములు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులెవరూ మృతదేహాన్ని కిందకు తీసే సాహసం చేయలేరు. బంధువులు, కుటుంబ సభ్యులు కూడా దగ్గరకు రాలేరు.
కరోనాతో వ్యక్తి ఆత్మహత్య.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు - నాగర్ కర్నూల్ ముస్లింల ఔదార్యం
కరోనాతో మృతి చెందితే.. నా అన్నవాళ్లు కూడా దహన సంస్కారాలకు ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన నలుగురు ముస్లిం యువకులు ఓ వ్యక్తికి దహన సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
![కరోనాతో వ్యక్తి ఆత్మహత్య.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు muslime people helped to corona victims](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:49:46:1621646386-tg-mbnr-8-21-manavatwam-chatukunna-yuvakulu-avb-ts10050-21052021213540-2105f-1621613140-808.jpg)
కానీ అదే గ్రామానికి చెందిన నలుగురు ముస్లిం యువకులు ముందుకు వచ్చి మృతదేహాన్ని కిందకు దించారు. ఖాజా బాబా, మహమ్మద్ ఖాజా, మల్లెపల్లి భాష, జోహార్ వీరులు... హిందూ ఆచార సాంప్రదాయాల ప్రకారం రాములుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా కారణంగా మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ముస్లిం యువకులు తెలిపారు. కరోనా వచ్చిన వాళ్లకు మనోనిబ్బరమే మందని అన్నారు. అందరూ మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తేనే... కరోనా బారినపడకుండా ఉంటామని పేర్కొన్నారు. ముస్లింలు అయినప్పటికీ.. హిందూ సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఆ యువకులను గ్రామస్థులు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు