వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడటం జిల్లాలో సంచలనం రేపుతోంది. ఒకే ఇంట్లోని వేర్వురు గదుల్లో మృతదేహాలు పడి ఉంటడం, మృతదేహాల వద్ద గులాబీ రేకులు, నిమ్మకాయలు, కొబ్బరి కాయలు ఉండటం, ఇంటి వెనకాల ఓ గొయ్యి తీసి ఉండటంతో.... అవి హత్యలా? ఆత్మహత్యాలా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సంఘటనా స్థలాన్ని బట్టి అక్కడ క్షుద్రపూజలు లేదా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఆ కుటుంబ సభ్యులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు జరపడం.. అది వివాదాస్పదం కావడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
హజీరాబీ తన స్వగృహంలో...
నాగపూర్‌కు చెందిన హజీరాబీ తన స్వగృహంలో ఒంటరిగానే నివాసం ఉంటున్నారు. ఆమె కూతురు అస్మాబేగం, అల్లుడు ఖాజాపాషా, మనుమరాలు అర్షిన్ నాగర్ కర్నూల్లో నివాసం ఉంటారు. రెండు రోజుల కిందట కూతురు, అల్లుడు, మనుమరాలు హజీరాబీ ఇంటికి వచ్చారు. తెల్లవారు ఏడున్నర దాటినా.. వాళ్లు బైటకు రాకపోయే సరికి చుట్టుపక్కల వాళ్లు ఇంట్లోకి వెళ్లి గమనించారు. హాల్ లో పదేళ్ల అర్షిన్, డైనింగ్ హాల్ లో అస్మాబేగం, వంటగదిలో హజీరాబీ, ఇంటి వెనకాల ఖాజా పాషా విగత జీవులై కనిపించారు. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఓకేసారి నలుగురి ప్రాణాలు...
ఒకేసారి నలుగురు ప్రాణాలు కోల్పోవడం, వేరు వేరు చోట్ల అనుమానాస్పదంగా మృతదేహాలు పడి ఉండటం వల్ల అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్పీ పరిశీలిన...
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎస్పీ అపూర్వరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాల వద్ద నిమ్మకాయలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, గులాబీ రేకులు ఉన్నాయి. ఖాజా పాషా మృతదేహం పక్కన ఓ గొయ్యి తీసి ఉంది. ఇక చిన్నారి అర్షిన్ ముక్కులోంచి నురగ బైటకు వచ్చింది. అందరి మృతదేహాల్లోనూ ముక్కు నుంచి నోటి నుంచి నురగ బైటకు వచ్చినట్లుగా కనిపిస్తోంది.