Food Poison in Nagarkurnool :నాగర్‌కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో 40 మందికి పైగా బాలికలు అస్వస్థతకు గురి కావడం కలకలం రేపింది. భోజనానంతరం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో.. సిబ్బంది వారిని హుటాహుటిన అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. 10 మందికి ఆక్సిజన్ అమర్చగా.. నలుగురిని నాగర్‌కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు శ్రీశైలం రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై ఆరా తీసిన మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod).. బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Food Poison in Mannanur : రాత్రి భోజనానంతరం కొందరు విద్యార్థినులు ఒక్కసారిగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, కడుపునొప్పితో బాధపడ్డారు. గమనించిన సిబ్బంది తొలుత స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. బాధితుల సంఖ్య పెరగడంతో అంబులెన్సు, ప్రత్యేక వాహనాల ద్వారా అచ్చంపేట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడ్డ 10 మందికి ఆక్సిజన్ అమర్చారు. మిగతావారికి సెలైన్ ఎక్కించారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని నాగర్‌కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులతో ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. డీటీడీఓ కమలాకర్ రెడ్డి పరిస్థితిని పర్యవేక్షించారు.
Mannanur ST Girls Hostel Students Fell Sick : కలుషిత ఆహారం(Contaminated Food) కారణంగానే అస్వస్థతకు గురయ్యామని బాలికలు తెలిపారు. రాత్రి భోజనం కోసం దొండకాయ కూర, సాంబార్ అన్నం పెట్టారని చెప్పారు. ఆహారం సరిగా ఉండదని అన్నంలో పురుగులు వస్తాయని, తాగునీరు సైతం కలుషితంగా ఉంటుందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. సమస్యలపై ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపానపోలేదని వాపోయారు.
బాలికల వసతి హాస్టల్లో కలుషిత ఆహారం కలకలం.. 20 మందికి తీవ్ర అస్వస్థత