శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న 30 మంది సిబ్బంది ఉన్నారు. సొరంగ మార్గం ద్వారా 15 మంది సిబ్బంది బయటపడ్డారు. జెన్‌కో ఆసుపత్రిలో డీఈ పవన్‌కుమార్, ప్లాంట్ జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, డ్రైవర్ పాలంకయ్య, మాతృ, కృష్ణారెడ్డి, వెంకటయ్య చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న 9 మంది - srisailam power station fire
శ్రీశైలం ఎడమగట్టు కాలువ భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో... రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాల్గో యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ కేంద్రంలో భారీగా పొగలు అలముకోగా... 9 మంది సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సహాయ చర్యలను విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు మంటలను అదుపుచేసేందుకు యత్నించారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మంటలు ఆరిపోయాయి. అయితే పొగలు దట్టంగా అలముకున్నందున సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. వీలైనంత త్వరగా వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, కలెక్టర్ శర్వన్, సీఎండీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు పరిశీలించారు. జల విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విద్యుత్ కేంద్రంలో పొగ దట్టంగా అలుముకోవడంతో లోపల ఉన్న సిబ్బంది శ్వాస ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి చెప్పారు.