Deer destroying crops : నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలోని రైతులకు జింకలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. చిన్నం బావి మండలంలో వెల్లుటూర్, చిన్నమారు, అయ్యవారిపల్లి, కాలూరు, చెల్లేపాడు, గూడెం, పెద్దమార్ గ్రామాల్లో జింకలు పంటలు నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొల్లచింతపల్లి, ముక్కిడిగుండం, మంచాలకట్ట, పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్దిన్నే గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. జింకలు పొలాల్లో గుంపులుగా తిరుగుతుండటం వల్ల పంట దెబ్బతింటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జింకలకు ఆహారంగా పంటలు
farmers worry about crops : ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు... ఇప్పుడు వేలల్లో అయ్యాయి. గ్రామాల శివార్లలో గొర్రెల మందలను తలపించేలా తిరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. మందలాగా వచ్చి కంది, ఆముదం, వరి, మినుముల పంటలను... మొక్క దశలోనే తినేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసినప్పటి నుంచి కోతకోసే వరకు పొలాల వద్ద రేయింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోందని వాపోయారు. ఈ ఏడాది సాగు చేసిన పంటల్లో సగం వరకు జింకలకే ఆహారంగా మారాయని పేర్కొన్నారు.
మా దగ్గర జింకలు గొర్రెల మందలను తలపిస్తున్నాయి. ఏ పంట వేసినా నాశనం చేస్తున్నాయి. కాస్త పెద్ద మొక్కగా మారే వరకూ కాపాడుకుంటూ వచ్చినా తింటున్నాయి. వేల ఎకరాల విస్తీర్ణంలో ఇవి సంచరిస్తూ... పంటలను తినేస్తున్నాయి. పెట్టుబడి కూడా వచ్చేలా లేదు.
-చిన్నారెడ్డి, రైతు
నేను 5 ఎకరాల్లో కందులు వేశాను. కంది, పత్తి చేన్లలో జింకల మందలు దాడి చేయడంతో నాశనమవుతున్నాయి. రెండు, మూడు సార్లు విత్తనాలు వేసినా తినేస్తున్నాయి. అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి వాటిని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేయాలి. తక్షణమే వాటికోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి.
-డేగ శేఖర్, రైతు