Farmers Struggling To Get Irrigation Water Under KLI: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద సాగైన చివరి ఆయకట్టు ఎండిపోతోంది. కేఎల్ఐ కింద యాసంగిలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆముదం, మిరప సహా పలు రకాల పంటలు సాగు చేశారు. యాసంగిలో కేఎల్ఐ కింద 2 లక్షల 64 వేల ఎకరాలకు ఆరు తడి పంటలకు, వారాబందీ విధానంలో సాగు నీరు అందిస్తామని నీటి పారుదల శాఖ అధికారులు ప్రణాళిక రచించారు. శ్రీశైలం జలాశయంలో నీటి లభ్యత లేక పదిహేను రోజులుగా ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. పంటలకు నీరందక అవి ఎండిపోయే స్థితికి వచ్చాయని.. కనీసం పెట్టుబడి రాని దుస్థితి నెలకొందని వాపోయారు.
Farmers Problems : కేఎల్ఐ కింద నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తిలోని మండలాల్లో రైతులు మొక్కజొన్నను విస్తృతంగా సాగు చేశారు. కాల్వ నీళ్లపై నమ్మకం పెట్టుకుని వేసిన పంట సాగు జలాలు లేక ఎండిపోతోంది. ఎకరానికి రూ.50 వేల వరకు పెట్టుబడి రాగా.. పాలకంకి దశలోనే పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వేరు శనగ సాగుచేసిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. సకాలంలో పంటకు నీరందక పశువులకు మేతగా వదిలేస్తున్నారు.