తెలంగాణ

telangana

ETV Bharat / state

కొల్లాపూర్​లో హైడ్రామా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యేల బహిరంగ సవాళ్లు

Kollapur TRS controversy : కొల్లాపూర్‌ రాజకీయం కాకరేపుతోంది. అధికార తెరాస నేతల వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య సవాళ్ల పర్వం మరింత వేడేక్కించింది. హర్షవర్ధన్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. మండిపడ్డ జూపల్లి.. పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు. అప్పులు చేశాను తప్ప.. తప్పులు చేయలేదని జూపల్లి వ్యాఖ్యానించారు. ఈ విమర్శలపై స్పందించిన హర్షవర్ధన్‌ రెడ్డి.. కాందిశీకుల భూములు తాకట్టుపెట్టి.. జూపల్లి రుణాలు తీసుకున్నారని ఆరోపించారు.

Kollapur TRS controversy
Kollapur TRS controversy

By

Published : Jun 27, 2022, 8:14 AM IST

Kollapur TRS controversy : నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ సవాళ్ల రాజకీయం తారాస్థాయికి చేరింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరస్పర సవాళ్లు ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న ఈ ఇద్దరు నేతలు.. కొల్లాపూర్ అంబేద్కర్ సెంటర్ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధమయ్యారు. బహిరంగ చర్చకు రావాలంటూ జూపల్లి కృష్ణారావు సవాల్‌ చేయగా.. జూపల్లి ఇంటికే వెళ్తానంటూ బీరం బదులిచ్చారు.

Jupally Controversy : జూపల్లి కృష్ణారావు, ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిల పరస్పర సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న ఈ ఇద్దరు నేతలు.. కొల్లాపూర్ అంబేడ్కర్ సెంటర్ వేదికగా ముఖాముఖి చర్చకు సిద్ధమయ్యారు. బహిరంగ చర్చకు రావాలంటూ జూపల్లి కృష్ణారావు సవాలు చేయగా.. జూపల్లి ఇంటికే వెళ్తానంటూ బీరం బదులిచ్చారు. ఇరువర్గాల నుంచి బహిరంగ చర్చకు అనుమతివ్వాలంటూ పోలీసులకు దరఖాస్తులు వెళ్లగా తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవాళ కొల్లాపూర్‌లో జనం గుమిగూడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నేతల సవాళ్లు, పోలీసుల పహారతో.. కొల్లాపూర్‌లో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

ఇద్దరు నేతలకు మద్దతుగా పెద్దఎత్తున కార్యకర్తలు, శ్రేణులు కొల్లాపూర్‌కు తరలివచ్చారు. మరోవైపు జూపల్లితో చర్చకు కొల్లాపూర్‌కు బయల్దేరిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సమయంలో కార్యకర్తల నినాదాలతో పరిసరాలు హోరెత్తాయి. జూపల్లి ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు ఎమ్మెల్యే వర్గం ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, తెరాస కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

అనంతరం మీడియాతో మాట్లాడిన జూపల్లి.. బీరం హర్షవర్ధన్‌రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేసి.. ప్రతిష్ఠకు భంగం కలిగించారని మండిపడ్డారు. బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారని తప్పుడు ఆరోపణలు చేశారన్న ఆయన.. చెల్లించిన రుజువులు చూపించారు. పాలమూరు ఎత్తిపోతలు కట్టొద్దని హర్షవర్ధన్‌రెడ్డి హరిత ట్రైబ్యునల్‌లో కేసు వేశారని జూపల్లి ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు.

దీనిపై స్పందించిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి.. కాందిశీకుల భూములు తాకట్టుపెట్టి రుణాలు పొందారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధిని చూడలేని వ్యక్తులు... తనపై సోషల్‌మీడియాలో అసత్యప్రచారాలు చేస్తున్నారని.. బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఇలాంటి ఆరోపణలు పునరావృతమైతే సహించేదిలేదని... పేర్కొన్నారు. జూపల్లి కృష్ణారావుపై తాను కూడా పరువు నష్టం కేసు వేస్తానని బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు.

ఇరునేతల బహిరంగ చర్చ దృష్ట్యా.... శనివారం సాయంత్రం నుంచే కొల్లాపూర్‌లో అదనపు పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అనుమతులు లేని సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక, మాజీ మంత్రి జూపల్లిని పోలీసులు గృహనిర్బంధం చేయగా... ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ను అరెస్టు చేశారు. కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు... ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా భద్రత ఏర్పాటు చేశారు.

కొల్లాపూర్‌ నియోజకవర్గంలో వర్గ విభేదాలపై తెరాస అధిష్ఠానం ఇప్పటికే దృష్టిసారించింది. ఇటీవల నాగర్‌కర్నూల్‌ జిల్లా పర్యటనలో జూపల్లి ఇంటికెళ్లి మంత్రి కేటీఆర్ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. తిరిగి నేతల మధ్య విభేదాలు సవాళ్ల రాజకీయంతో మరింత ముదిరి పాకానపడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details