పులులను సంరక్షించడంతో పాటు వాటి నుంచి మనుషులకు నష్టం కలగకుండా అటవీ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ పెద్దపులుల అభయారణ్యం కోర్ ఏరియాలో నివాసముంటున్న వారిని ఇతర గ్రామాలకు తరలించడంపై దృష్టి సారించింది. దీనికోసం గత వారం రోజులుగా చెంచు పెంటలు, కోర్ ఏరియాలోని గ్రామాల్లో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మైదాన ప్రాంతానికి తరలివెళ్తే ఇచ్చే ప్యాకేజీ గురించి వివరిస్తున్నారు. నాగర్‌కర్నూల్ సమీపంలోని బాచారం గ్రామానికి తరలించాలని గిరిజనేతరులు కోరుతుండగా.. అడవి లేని ఆ ప్రాంతానికి వెళ్తే జీవించలేమని చెంచులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో సింహభాగం పెద్దపులులున్న నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ఇటీవల వీటి సంఖ్య మరింత పెరిగిందని, అటు పులులకు, ఇటు మనుషులకు నష్టం జరగకుండా, పులుల ఆవాస ప్రాంతాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. టైగర్ రిజర్వు ప్రాంతాల నుంచి తరలించే ఒక్కో కుటుంబానికి గతంలో రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుండేవారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ ) ఈ మొత్తాన్ని గతేడాది రూ.15 లక్షలకు పెంచింది. పరిహారంతో పాటు కోల్పోతున్న అటవీ భూమికి సమానమైన భూమిని కూడా ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 18 ఏళ్లపైబడి, పెళ్లికాని వారినీ పరిహారానికి అర్హులుగా నిర్ణయిస్తామంటున్నారు.