తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతిమ ఘడియల్లో ప్రాణత్యాగానికి సిద్ధపడిన విద్యుత్‌ సిబ్బంది

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది ? ఎలా మొదలైంది ? ఎవరు ఎలా స్పందించారు ? పలువురు ప్రత్యక్ష సాక్షులను పలకరించి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈనాడు - ఈటీవీ భారత్ ప్రయత్నించింది. ఫలితంగా పెను ప్రమాదం జరగకుండా విద్యుత్‌ ఉద్యోగుల సాహసం, ఆఖరి క్షణాల్లోనూ వారు అద్భుత స్ఫూర్తిని ప్రదర్శించిన తీరు వెలుగులోకి వచ్చాయి.

అంతిమ ఘడియల్లో ప్రాణత్యాగానికి సిద్ధపడిన విద్యుత్‌ సిబ్బంది
అంతిమ ఘడియల్లో ప్రాణత్యాగానికి సిద్ధపడిన విద్యుత్‌ సిబ్బంది

By

Published : Aug 22, 2020, 7:45 AM IST

బయటపడే అవకాశమున్నా ప్రాణ త్యాగం

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికి వారు అక్కడి నుంచి బయటపడాలని చూస్తారు. కానీ పెనుప్రమాదాన్ని తప్పించడానికి విద్యుత్‌ సిబ్బంది ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ప్రమాదం జరగగానే వారు పై అంతస్తుకు వచ్చేసి ఉంటే సొరంగ మార్గాల ద్వారా బయట పడే అవకాశం ఉండేది. కానీ టర్బైన్లు ఆపకుంటే తలెత్తే ఉపద్రవాన్ని ఊహించి ముందుకురికారు. వాటి నుంచి విద్యుత్ ఉత్పత్తయితే ప్లాంటు మొత్తానికే ప్రమాదమని భావించి తెగించారు. టర్బైన్లను నిలిపివేశారు. అంతకుముందే పొగలు వ్యాపించడంతో 400 కేవీ ఉపకేంద్రాన్ని నిలిపివేశారు. విద్యుత్తు ఉత్పత్తిని సైతం నిలిపి షట్టర్లు మూశారు. టన్నెల్‌లోకి నీళ్లు రాకుండా ఆపారు. వాటిని ఆపకుండా 400 కేవీ నిలిపి వేసి ఉంటే మరింత ప్రమాదం ఏర్పడేదని నిపుణులు అంటున్నారు.

పవన్‌కుమార్‌ను కాపాడిన డ్రైవర్‌ పాలెంకయ్య

‘‘విద్యుదుత్పత్తి కొనసాగుతున్న సమయంలో మొదటి యూనిట్‌లో ఏవీఆర్‌ ప్యానల్‌ బోర్డులో తొలుత అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడి నుంచి నాలుగు టెర్మినల్‌ ప్యానల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. తొలుత మంటలు చెలరేగిన వెంటనే డీఈ పవన్‌కుమార్‌ సిబ్బందితో కలిసి మంటలు అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. భారీ పేలుళ్లతో మంటలు ఎగసి పడుతుండటంతో వెనక్కి పరుగులు తీశారు. అప్పటికే దట్టమైన పొగ అలుముకోవడంతో డ్రైవర్‌ పాలెంకయ్య డీఈ పవన్‌ను వాహనంలో ఎక్కించుకుని దారి కనిపించకపోయినా ఒక చేత్తో సొరంగం గోడను తాకుతూ చాకచక్యంగా బయటకు తీసుకురాగలిగారు.’’

-ఓ ప్రత్యక్ష సాక్షి

పొగను పీల్చుకుంటూ పరుగులు పెట్టాం

18 సంవత్సరాలుగా ఎలక్ట్రీషియన్‌గా చేస్తున్నా. ప్యానల్‌ బోర్టులో బ్యాటరీ ప్యాకేజీ అమర్చడానికి వెళ్లాం. షార్ట్‌ సర్క్యూట్‌ అయిందని సమాచారం వచ్చింది. మిగతా యూనిట్లకు విస్తరించింది. మొత్తం 15 మంది వరకు ఉన్నాం. ఎలాగో బయటకు రావడానికి ప్రయత్నించాం. డీఈ పవన్‌కుమార్‌, పాలెంకయ్య మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. ప్లాంటులో పవర్‌ ఆపివేయడంతో పూర్తి చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో పొగను పీల్చుకుంటూనే బయటకు పరుగులు పెట్టాం.

- కృష్ణారెడ్డి, ఆర్టిజన్‌ కార్మికుడు, ఈగలపెంట

కాపాడేందుకు వెళ్లి కన్నుమూత

‘‘ఫాతిమా లిఫ్ట్‌ సమీపంలోనే విధులు నిర్వహిస్తున్నారు. కారు దగ్గరలోనే ఉంది. ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ముందే బయటకు వచ్చే అవకాశం ఉండేది. అయితే బ్యాటరీల పనిపై వచ్చిన కంపెనీ సిబ్బందిని కాపాడేందుకు వెళ్లి మంటల్లో చిక్కుకున్నారు.ఎంసీఆర్‌ ఏఈ సుందరం ఫైర్‌ అలారం మోగించి ఎస్కేప్‌ టన్నెల్‌ జీఐఎస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ శ్వాస ఆడక కింద పడిపోయారు. ఆ మంటల ధాటికి చొక్కా కరిగిచర్మం కాలి మృతి చెందారు.

- ప్రమాదం నుంచి బయటపడిన కార్మికుడు

ఊపిరి బిగబట్టి ఉంటే బతికేవారేమో?

ప్యానల్‌ బోర్డులో ప్రమాదం జరిగితే క్షేమంగా బయటపడడానికి డీజిల్‌ షెడ్‌ వద్ద మార్గం ఉంది. అక్కడి నుంచి 350 మీటర్ల దూరం నుంచి వెళ్తే చాలు.. క్షేమంగా బయట పడవచ్చు. నేరుగా వెళ్లి క్షేమంగా బయటపడాలటే కిలోమీటర్‌ వెళ్లాలి. ఏఈలు సుందర్‌, మోహన్‌, ఫాతిమాలు డీజిల్‌ షెడ్డు మార్గం నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేశారు. అక్కడే సుందర్‌, మోహన్‌, ఫాతిమాల మృతదేహాలు ఉన్నాయి. అక్కడి నుంచి వారు బయటకు రావడానికి 2 నుంచి 4 నిమిషాల సమయం పడుతుంది. కానీ వారు అక్కడే విగతా జీవులై పడి ఉన్నారు.

ఆ కొద్దిసేపు ఊపిరి బిగబట్టి ఉండుంటే...

ఆ కొద్దిసేపు ఊపిరి బిగబట్టి ఉంటే వారు సురక్షితంగా బయటపడేవారు. సుందర్‌ మృతదేహం గందరగోళంగా పడి ఉంది. వేడికి చర్మం ఊడిపోయింది. పొగ ఎక్కువ ఉండడంతో మోహన్‌ చొక్కా తీసి ముఖానికి చుట్టుకున్నారు. ఫాతిమాకు బురఖా ఉంది. శ్రీనివాసులు మృతదేహం అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉంది. బ్యాటరీ కంపెనీ ఉద్యోగి మహేశ్‌ మృతదేహం 20 మీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఒక్క నిమిషం ఊపిరి బిగబట్టి ఉంటే బతికి బయట పడే అవకాశం ఉండేది. వెంకట్రావు, కిరణ్‌, రాంబాబు మృతదేహాలు గ్యాస్‌ ఇన్స్‌లేటివ్‌ స్విచ్‌ గేర్‌ వద్ద ఉన్నాయి.

- మృతదేహాలను బయటకు తీసుకొచ్చిన ఫైర్‌ డ్రైవరు తులసీరాం నాయక్‌

కోలుకున్న సిబ్బంది

ప్రమాదంలో అస్వస్థతకు గురైన విద్యుత్‌ ఉద్యోగులు కోలుకున్నారు. గురువారం రాత్రి 11 గంటలకు డీఈ పవన్‌కుమార్‌, జేపీఏలు మత్రూ, వెంకటయ్య, రామకృష్ణ, ఎలక్ట్రీషియన్‌ కృష్ణారెడ్డి, డ్రైవర్‌ పాలెంకయ్య సర్వీస్‌ బే నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో పొగ పీల్చి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్పృహ కోల్పోయారు. వీళ్లను వెంటనే అంబులెన్స్‌ ద్వారా ఈగలపెంటలోని జెన్‌కో ఆస్పత్రికి తరలించారు. వాళ్లకు ఆక్సిజన్‌ అందించి సత్వర చికిత్సను నిర్వహించారు. ఉదయం వరకే అందరూ సాధారణ పరిస్థితికి వచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలో ఉంచి అనంతరం ఇళ్లకు పంపించారు.

అయిదుగుర్ని బయటికి తీసుకొచ్చాం

ఆరేళ్ల నుంచి డ్రైవరుగా పనిచేస్తున్నా. మాది దోమలపెంట. డీఈని ఈగలపెంటలోని ఆయన ఇంటి వద్ద దించేందుకు పవర్‌హౌస్‌ బయట ఎదురుచూస్తుండగా యూనిట్లలో మంటలు వ్యాపించాయి. వెంటనే అతిథి గృహం వద్దకు వచ్చి సీఈ సురేష్‌, ఇతర అధికారులను సంఘటన స్థలానికి తీసుకెళ్లాను. అప్పటికే పవర్‌హౌస్‌ వద్ద దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అతికష్టం మీద రాత్రి 10.30 తరవాత డీఈ, మరో నలుగురిని క్షేమంగా బయటకు తీసుకొచ్చాం. ఈ క్రమంలో పొగపీల్చడంతో అస్వస్థతకు గురయ్యాను.

- పాలెంకయ్య, డ్రైవర్‌

ఇవీ చూడండి : అన్నీతానైన తల్లి.. అనాథగా మిగిలింది...

ABOUT THE AUTHOR

...view details