రాష్ట్రంలో తెరాస కార్యకర్తల తీరు దారుణంగా మారిందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆందోళన వ్యక్తం చేశారు. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే పరిస్థితులు తలెత్తుతున్నాయని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఆమె పర్యటించారు. అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అప్పాయిపల్లి గ్రామంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేశారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాలలో పాల్గొన్నారు. డీకే అరుణకు ప్రజలు, భాజపా కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
"తెలంగాణ మీ జాగీరు కాదు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడానికి. కార్యకర్తలను అదుపులో పెట్టాల్సిన బాధ్యత మీపై ఉంది. రాష్ట్రంలో తెరాస తప్ప ఇతర పార్టీల ఫ్లెక్సీలు పెడితే.. తెరాస కార్యకర్తలు చించి వేస్తున్నారు. ఇదేమి సంస్కృతి. సీఎం కేసీఆర్, అతని కుమారుడు కేటీఆర్ ఫ్లెక్సీలు మాత్రమే ఉండేలా తెరాస కార్యకర్తలు చేస్తున్నారు. మా పార్టీ ఫ్లెక్సీలు చించడం ఏంటి.? కేసీఆర్, కేటీఆర్ బొమ్మలు చూసి చూసి ప్రజలకు రోత పుట్టింది"