నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు... కరోనా విపత్తు సమయంలో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి.
పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర సరకుల పంపిణీ - నిత్యావసర సరకుల పంపిణీ
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రజలందరూ మాస్కులు ధరిస్తూ... భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వ విప్ దామోదర్ రెడ్డి సూచించారు. పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీల ఇబ్బందులను గుర్తించి... ప్రతి మండల కమిటీ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరకులను అందించాలని సూచించినట్లు ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు అందరూ కలిసి వారి ఒక రోజు జీతం పోగుచేసి ప్రభుత్వానికి 18 కోట్ల రూపాయలు అందజేశామని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పాటుపడుతున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో చేస్తున్న సేవను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు.