Differences in the BRS party of Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్లో కుమ్ములాటలు బయటపడ్డాయి. గురువారం జరిగిన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక పార్టీలో భేదాభిప్రాయాలకు దారితీసింది. ఛైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డ కల్వకుర్తి జడ్పీటీసీ, నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్ తన జడ్పీటీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తమ ఏకఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి.. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రాకుండా చేయడానికి, ఎదగనివ్వకుండా అడ్డుకునేందుకే సొంత పార్టీలోని వ్యక్తులే ప్రయత్నం చేస్తున్నారని భరత్ ఆరోపించారు. బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా ఎదిగేలా చేసేందుకు కేసీఆర్ కృషి చేస్తుంటే.. అచ్చంపేటలో కొందరు నేతలు పార్టీని చంపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ఉన్న తెలకపల్లి జడ్పీటీసీ పద్మావతి ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునివ్వడంతో, గురువారం కొత్త జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికకు అధికారులు రంగం సిద్ధం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ప్రస్తుతం ఎస్సీ జనరల్ కేటగిరిలో ఎన్నికైన బీఆర్ఎస్ జడ్పీటీసీలు కల్వకుర్తి, ఊర్కొండలో మాత్రమే ఉన్నారు. దీంతో ఇద్దరిలో ఎవరకో ఒక్కరికే ఆ పదవి దక్కే అవకాశం ఉంది. కాగా మొత్తం 20 జడ్పీటీసీ స్థానాల్లో 19 జడ్పీటీసీ స్థానాలు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ఉండగా.. ఊర్కొండ మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో ఉంది. దీంతో కచ్చితంగా ఛైర్మన్ పదవి కల్వకుర్తి జడ్పీటీసీగా ఉన్న భరత్ కుమార్‌కే దక్కుతుందని అంతా భావించారు.