తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీశైలం ప్రమాదంపై లోతుగా సీఐడీ విచారణ - శ్రీశైలం ప్రమాదం తాజా వార్తలు

అంత అత్యవసరంగా బ్యాటరీలు మార్చేంతగా పాతవి పాడయ్యాయా? అనేది కీలకప్రశ్న. అదే నిజమైతే అంత పాడయ్యేదాకా ఎందుకు వేచి ఉన్నారు? ముందే ఎందుకు మార్చలేదు? పగటిపూట నిపుణుల సమక్షంలో పనులు ఎందుకు చేయలేదు? ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారులు ఎందుకు లేరు? అని విచారిస్తున్నారు.

శ్రీశైలం ప్రమాదంపై లోతుగా సీఐడీ విచారణ
శ్రీశైలం ప్రమాదంపై లోతుగా సీఐడీ విచారణ

By

Published : Aug 25, 2020, 6:20 AM IST

శ్రీశైలం జలవిద్యుత్కేంద్రంలో ప్రమాదంపై సీఐడీ లోతుగా విచారణ చేస్తోంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల వెనుక కారణాలను విశ్లేషిస్తోంది. 220 కేవీ డీసీ కరెంటు సరఫరాకు బ్యాటరీలను బిగించే సమయంలోనే ప్యానల్‌ బోర్డులో మంటలు వచ్చి ప్లాంటులో అగ్నిప్రమాదం జరిగింది. కానీ రాత్రి 10.30 గంటల సమయంలో బ్యాటరీలు బిగించే పనులు చేయాల్సిన అవసరం ఏముందని ఆరా తీస్తున్నారు.

అంత అత్యవసరంగా బ్యాటరీలు మార్చేంతగా పాతవి పాడయ్యాయా? అనేది కీలకప్రశ్న. అదే నిజమైతే అంత పాడయ్యేదాకా ఎందుకు వేచి ఉన్నారు? ముందే ఎందుకు మార్చలేదు? పగటిపూట నిపుణుల సమక్షంలో పనులు ఎందుకు చేయలేదు? ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారులు ఎందుకు లేరు? అని విచారిస్తున్నారు. ప్లాంటులో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతున్న సమయంలోనే బ్యాటరీల ఏర్పాటు పనులు చేస్తుండగా మంటలు మొదలయ్యాయి. కానీ ఆ సమయంలో ఉత్పత్తి ఆపివేస్తే నష్టమేంటనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ప్లాంటుకు చీఫ్‌ ఇంజినీరు (సీఈ) అధిపతిగా ఉన్నారు. ఆయనతో పాటు జలవిద్యుత్కేంద్రాల విభాగానికి ప్రధాన కార్యాలయం విద్యుత్‌సౌధలో ఇంఛార్జిగా ఉన్న సీఈ కూడా బ్యాటరీల ఏర్పాటు పనులను పర్యవేక్షించడానికి ప్రమాదం జరిగిన రోజు శ్రీశైలం వెళ్లారు. ఈ ఇద్దరు సీఈలు ప్రమాదం జరగడానికి కొంతసేపటి ముందే భోజనం చేయడానికి ప్లాంటు నుంచి బయటికి వెళ్లారు. వారు వెళ్లే సమయంలో పనులు ఎందుకు ఆపలేదు? ప్రైవేటుకంపెనీ సిబ్బందితో పనులు చేయించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనేది విచారణలో తేలనుంది. ఇంతపెద్ద ప్రమాదానికి వాస్తవంగా ఎవరు బాధ్యులో గుర్తించి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జెన్‌కో తీవ్రంగా ఆలోచిస్తోంది. శాఖాపరంగా ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ విచారణలోనే ఆ బాధ్యులెవరో తేలుతుందని భావిస్తున్నారు.

బూడిదైన ప్యానల్‌బోర్డు

తొలుత మంటలు లేచిన ప్యానల్‌బోర్డు పూర్తిగా కాలి బూడిదైంది. అక్కడ ఎలాంటి ఆధారాలు దొరుకుతాయా అని సీఐడీ అన్వేషిస్తోంది. ప్రమాదంలో నెలకొన్న సాంకేతిక సమస్యలపై విచారణకు జెన్‌కో నియమించిన నిపుణుల కమిటీ ఛైర్మన్‌ రఘుమారెడ్డి, సభ్యులు వెంకటరాజం, జగత్‌రెడ్డి, సచ్చిదానందంలు సోమవారం సాయంత్రానికి ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్న సీఐడీ బృందం సభ్యులు కొంత మంది అధికారులు, సిబ్బందిని మాత్రమే విచారించారు. ప్రమాదం జరిగిన నాలుగు, ఆరో యూనిట్లను, బ్యాటరీ గదులను ఆదివారం సీజ్‌ చేశారు. రెండో సెట్‌ బ్యాటరీలు బిగిస్తున్న సందర్భంగా ప్యానల్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌ అయిందని, జనరేటర్లను నియంత్రించే సెన్సార్‌కు నేరుగా విద్యుత్తు (డైరెక్టు కరెంటు) సరఫరా కాకపోవడంతో లోడ్‌ పెరిగి మంటలు చెలరేగినట్లు అధికారవర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం.

భారీగా వస్తున్న ఊట నీరు

విద్యుత్కేంద్రంలోకి ఊట జలం భారీగా వస్తోంది. ఆదివారం నుంచి 10 హెచ్‌పీ, 15 హెచ్‌పీ మోటార్ల ద్వారా ఈ నీటిని బయటికి ఎత్తిపోస్తున్నా ఇంకా భారీగా ఉంది. సోమవారం రాత్రివరకు తగ్గిన నీటి మట్టం రెండు అడుగులు మాత్రమే. అడుగు భాగం నుంచి రెండు అంతస్తులు ఊట జలంతో మునిగిపోయాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ సామర్థ్యం గల విద్యుత్తు మోటార్లను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 60 హెచ్‌పీˆ సామర్థ్యం గల ఓ పంపును తీసుకొచ్చారు. ఊట జలాన్ని తొలగిస్తేకానీ పునరుద్దరణ పనులు ముందుకు సాగవని ఇంజినీరింగ్‌, సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అవి పూర్తయిన తరవాత 1 లేదా 2 యూనిట్లలో విద్యుదుత్పత్తి ప్రారభించాలని జెన్‌కో యోచిస్తోంది.

మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలి

జలవిద్యుత్కేంద్రం పునరుద్ధరణ పనులు వేగంగా జరగడానికి మరిన్ని భద్రతా చేపట్టాలని స్థానిక సిబ్బంది కోరుతున్నారు.కార్బన్‌ మోనాక్సైడ్‌, ఇతర వాయువులను బయటికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నియంత్రికల ద్వారా లీకయిన ఆయిల్‌ కూడా ప్రమాదకరమని, తాజా గాలిని పవర్‌ హౌస్‌లోకి పంపే ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఆక్సిజన్‌ సమస్య కూడా ఉందంటున్నారు. సరిపడా ఆక్సిజన్‌ సిలిండర్లు, హెల్మెట్లు, డ్రాగన్‌ లైట్లు ఇతర రక్షణ సామగ్రిని సమకూర్చాలని విన్నవిస్తున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక వసతులున్న ఐసీయూ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

శ్రీశైలం ప్రమాదంపై నివేదిక ఇవ్వండి: కృష్ణా బోర్డు

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంపై నివేదిక ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు.. తెలంగాణ జెన్‌కో సంచాలకుడికి లేఖ రాసింది. కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ సూచన మేరకు నివేదికను కోరుతున్నట్లు బోర్డు సభ్యుడు (పవర్‌) ఎల్‌బీ మ్యుంతంగ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది!

ABOUT THE AUTHOR

...view details