భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, కేటీదొడ్డి మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. ఉండవల్లి మండలం బొంకూరు పెద్ద వాగు ఇప్పటి 3,4 సార్లు పొంగింది. దీంతో ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలు మునిగిపోయాయి. 150 ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. కలుగోట్ల, శాలిపూర్, తక్కాశీల, కంచుపాడులో దాదాపు 502 ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది. మానవపాడు మండలంలో 1,171 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎక్కువగా పత్తి, ఉల్లి, మిర్చి పంట దెబ్బతింది. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కేటిదొడ్డి, దరూర్, వడ్డేపల్లి, ఉండవల్లి, ఇటిక్యాల మనవపాడు మండలాల్లో సుమారు 3000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు.
కొట్టుకుపోయిన పంటలు
నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. చెరువులు, కాలువలు, కుంటల పక్కన ఉండే పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. వరి, పత్తి, కందులు, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 600482 ఎకరాల్లో పంట సాగు చేస్తుండగా.. ఇందులో వరి 96 వేల ఎకరాలు, పత్తి నాలుగున్నర లక్షలు, మొక్కజొన్న 12 వేలు, కంది 25 వేలు, వేరు శనగ 20 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇందులో పత్తి, వరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, తెల్కపల్లి, తిమ్మాజీపేట, ఉప్పునుంతల మండలాల్లో 7331 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.