తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణానదిలో ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్రలు - adventures on the Krishna River At Nagarkurnool district

రోడ్డు మార్గం ద్వారా అవతలి వైపు ఒడ్డుకు వెళ్లాలంటే సుమారు 200 కిలోమీటర్లు. నదిలో నుంచి వెళితే కేవలం 2 కిలోమీటర్లు. ఇంతటి దూరాభారాన్ని తగ్గించుకునేందుకు... నిత్యం అక్కడి ప్రజలు, మూగజీవాలు ప్రమాదకరంగా రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ప్రాణాలు ఫణంగా పెట్టి కృష్ణానదిని దాటుతున్న ప్రయాణాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

కృష్ణానదిలో ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్రలు
కృష్ణానదిలో ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్రలు

By

Published : Dec 29, 2020, 11:02 PM IST

కృష్ణానదిలో ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్రలు

నదిలో పడవ ప్రయాణం అంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించాలి. కానీ ఈ నది దాటాలంటే ప్రాణాలు పణంగా పెట్టి మృత్యువుకు ఎదురొడ్డి పోరాడాలి. మనుషులే కాదు మూగజీవాలూ బతుకుజీవుడా అంటూ రాకపోకలు సాగించాలి.

దారుణ పరిస్థితి...

నోరులేని జీవాల పరిస్థితి మరింత దారుణం. 2 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా ఈదాలి. కాలు ఆగిందో... ఊపిరి కూడా ఆగిపోయినట్లే. అలుపొచ్చినా, ఆయాసమైనా ఈత ఆపితే జలసమాధి అయినట్లే. ఎంత కష్టమైనా, ఎంత ఇబ్బందిపడినా నది దాటితేనే ప్రాణాలతో ఉన్నట్లు. లేదంటే మృత్యువు కౌగిట దిగ్బంధమైనట్లు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నుంచి కర్నూల్‌ జిల్లా వైపు కృష్ణానదిలో జరుగుతున్న రాకపోకలు... గగుర్పాటుకు గురి చేస్తున్నాయి.

అద్దం పట్టే దృశ్యాలు...

నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లపూర్ నుంచి కర్నూల్ జిల్లా సిద్దేశ్వరం, సంగమేశ్వరం, బండి ఆత్మకూర్ వైపు ప్రమాదకరమైన పడవ ప్రయాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనషులే కాకుండా మూగ జీవాల్ని సైతం ప్రమాదకర పరిస్థితుల్లో కృష్ణానది దాటిస్తున్నారు. ఈ ప్రమాదకర ప్రయాణానికి అద్దం పట్టే దృశ్యాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి.

సోమశిలకు సమీపంలోని నది ఒడ్డు నుంచి అవతలి వైపు ఒడ్డుకు మరబోటు సహా నాటుపడవలో మనుషులు ప్రయాణిస్తూ.. మూగజీవాల్ని నదీలో ఈదుకుంటూ తీసుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఓ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం అక్కడకు వెళ్లిన వీడియోగ్రాఫర్లు నదిలో కనిపించిన దృశ్యాలను చిత్రీకరించారు.

2కి.మీ. ప్రయాణిస్తే...

ప్రతి బుధవారం సింగోటంలో పశువుల సంత జరుగుతుంది. ఈ సంతలో పశువుల్ని కొనుగోలు చేసే రైతులు... మూగజీవాల్ని నది దాటిస్తుంటారు. రోడ్డు మార్గం ద్వారా నది అవతలి వైపునకు వెళ్లాలంటే సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అదే నదిలో అయితే 2 కిలో మీటర్లు ప్రయాణిస్తే అవతలి ఒడ్డుకు చేరుకోవచ్చు.

నిత్యం ఫీట్లు...

వ్యయ, దూర, సమయ భారాన్ని తగ్గించుకునేందుకు ఇలాంటి ఫీట్లు నిత్యం కొనసాగుతూనే ఉంటాయి. 2007 జనవరి 18న సింగోటం జాతర కోసం బండి ఆత్మకూరు నుంచి మంచాల కట్ట వైపు వస్తున్న నాటుపడవ మునిగి 61 మంది అక్కడికక్కడే జలసమాధి అయ్యారు. సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసే అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details