పెరిగిన ధరలు.. దొరకని కూలీలు.. ఆగిన పనులు కరోనా మహమ్మారి నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్మాణానికి అవసరమైన సామగ్రి ధరలు 20 నుంచి 30 శాతం మేర పెరిగిపోయాయి. ఫలితంగా సొంతిల్లు నిర్మించుకోవాలనుకున్న పేద, మధ్య తరగతి ప్రజల ఆశలు ఆవిరైపోతున్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 7 వేలకు పైగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు అధికారుల అంచనా. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోనే సుమారు 400 ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో 2 నెలల పాటు నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. సడలింపులతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణ రంగంలో కదలిక వచ్చింది. ఇప్పుడిప్పుడే పనులు మొదలయ్యాయి.
పెరిగిన ధరలు..
ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన వారికి అధిక ధరలు భారంగా మారుతున్నాయి. లాక్‌డౌన్ కంటే ముందున్న ధరలకు, ఇప్పుడున్న ధరలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇదివరకు సిమెంట్ బస్తా ధర రూ.280 ఉంటే.. ఇప్పుడు రూ. 400 నుంచి 450 రూపాయల దాకా ఉంది. స్టీలు క్వింటాల్‌కు రూ.4,300 ఉంటే.. ఇప్పుడు రూ. 4,800 ఉంది. ట్రాక్టర్ ఇసుక గతంలో రూ. 4 వేలు ఉంటే.. ఇప్పుడు 6 నుంచి 7 వేల దాకా ఉంది. -బాలస్వామి
ప్రభుత్వం దృష్టి సారించాలి
ఇక కంకర, ఇటుకలు, రాయి, మొరం ఇలా అన్నింటి రేట్లు 20 నుంచి 30 శాతం వరకు పెరిగాయి. ఇదీకాక తాపీమేస్త్రీలు, కూలీలు సైతం తమ రేట్లను పెంచేశారు. ఎక్కువ డబ్బులు చెల్లించినా కరోనా భయంతో ఒక్కోసారి కూలీలు దొరకడం లేదని.. పనులు సరిగా జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ రంగంపై ప్రభుత్వం దృష్టి సారించి.. ధరలను నియంత్రిస్తే బాగుంటుందని బాధితులు కోరుతున్నారు.
'2 రూములతో చిన్న ఇళ్లు నిర్మించుకోవాలనుకున్నాం. 2 నెలల్లో పూర్తవుతుందని అనుకుంటే.. ఆరు నెలలు గడిచినా పూర్తి కాలేదు. లాక్‌డౌన్ కంటే ముందున్న ధరలకు, ఇప్పుడున్న ధరలకు చాలా వ్యత్యాసం ఉండటం వల్ల అనుకున్న దానికంటే ఎక్కువ వ్యయం అవుతోంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి.. ధరలను నియంత్రించాలి'. -అశోక్
ఇదీచూడండి: 'ప్రభుత్వ సూచనలు వచ్చేంత వరకూ పరీక్షల్లేవ్'