Congress Public Meeting at Kollapur : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభ కోసం కాంగ్రెస్ కసరత్తు జోరందుకుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు పలువురు ఇతరపార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనుండటంతో సభను పెద్దఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా కావడంతో ఖమ్మం జనగర్జనకుఏ మాత్రం తీసిపోకుండా ఉండాలని పీసీసీ యోచిస్తోంది. ఐతే రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగానే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు సన్నాహక సమావేశం నిర్వహించారు.
Priyanka Gandhi Attends Kollapur Meeting :తాజాగా మొయినాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్ రెడ్డిల నేతృత్వంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథ్ రెడ్డి, వంశీకృష్ణ, గద్వాల్ జడ్పీ ఛైర్మన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి నుంచి జనం తరలింపు, సభ నిర్వహణ, ముఖ్యనాయకుల ఏర్పాట్లు, సభాస్థలి ఎంపిక తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.