కృష్ణానదిపై ప్రభుత్వం భారీవ్యయంతో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్యాకేజీ-1లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా రేగుమాన్‌గడ్డ వద్ద సర్జ్‌పనులు చేస్తుండగా ప్రమాదం చేటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. సర్జ్‌పూల్‌లో కాంక్రీట్ లైనింగ్ కోసం క్రెయిన్ కిందకు దింపుతుండగా ఒక్కసారిగా తీగలు తెగిపోయి లోపల ఉన్న కార్మికులపై కుప్పకూలింది.
దీంతో ఐదుగురు కార్మికులు ప్రాణాలొదిలారు. మరణించినవారిలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి ఉండగా బిహార్, ఝార్ఖండ్‌కు చెందిన నలుగురు ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన శ్రీను, ఝార్ఖండ్‌కు చెందిన భోలేనాథ్, ప్రవీణ్, కమలేష్, బిహార్‌కు చెందిన సోనూకుమార్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి శవపరీక్ష అనంతరం బంధువులకు అప్పగించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనుల వద్ద ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, భాజపాలు డిమాండ్ చేశాయి. ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణం చెందటం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.