తెలంగాణ

telangana

ETV Bharat / state

పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్​... అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీస్​ - nagarkurnool district latest news

నెలరోజుల క్రితం నాగర్​కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టారు... అప్పటి నుంచి జిల్లాలో ఆకస్మిక పర్యటనలతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. రాత్రి వరకూ క్షేత్రస్థాయిలో పర్యటనల్లోనే ఉండి... తెల్లవారే సరికి ఏదో మండలంలోని మారమూల పల్లెల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఆకస్మిక తనిఖీలు, అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీసులు. ఒక్కో రోజే జిల్లాలోని 20 మండలాలకు గాను..18 మండలాలు చుట్టి వచ్చి.. ఔరా అనిపించారు. జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కేవలం అధికారులనే పరుగులు పెట్టిస్తాయా? పల్లెలు,పట్టణాల్లో ప్రగతిని కూడా పరుగులు పెట్టిస్తాయా? వేచిచూడాల్సిందే. ఇంతకీ ఎవరా కలెక్టర్ ?

collector sharman sudden inspections in nagarkurnool district
పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్​... అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీస్​ జారీ

By

Published : Aug 14, 2020, 11:16 AM IST

మార్నింగ్ వాక్ కోసం ఎక్కడికి వెళ్తాం? దగ్గర్లో ఉన్నక్రీడా మైదానానికో... సమీపంలోని వాకింగ్ ట్రాక్ కో వెళ్తాం. కాని ఆ కలెక్టర్ మాత్రం మార్నింగ్ వాక్ కోసం దగ్గర్లోని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, గ్రామాలకు వాహనంలో వెళ్లి అక్కడ మార్నింగ్ వాక్ చేస్తారు. మార్నింగ్ వాక్ చూస్తూనే అక్కడి హరితహారం, పారిశుద్యం, పల్లె,పట్టణ ప్రగతి పనులను పరిశీలిస్తారు. ఆకస్మికంగా అభివృద్ధి పనులను తనిఖీ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటే సరి. లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. ఇంతకీ ఎవరా కలెక్టర్ అని ఆలోచిస్తున్నారా? ఆయనే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్.

గురువారం ఒక్కరోజే జిల్లాలోని 20 మండలాల్లో 18 మండలాలు చుట్టి వచ్చి ఔరా అనిపించారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 14 గంటలపాటు నిర్విరామంగా ఆకస్మిక పర్యటన కొనసాగించారు. పదర మండల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా ఎంపీడీవో అందుబాటులో లేకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

జూలై 17న నాగర్ కర్నూల్ జిల్లా నూతన కలెక్టర్ గా శర్మన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పర్యటనల్లో పాల్గొంటున్నారు. . నెల రోజుల్లో దాదాపు అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, 200లకు పైగా గ్రామాలను సందర్శించారు. విధుల్లో అలసత్వం వహించిన 150 మంది పంచాయతీ కార్యదర్శులకు, 158 మంది సర్పంచ్ లకు, 15 మండలాల ఎంపీడీఓలకు, 15 మండలాల ఎంపీఓ లకు ఇప్పటి వరకూ ఆయన షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కొద్ది రోజుల కిందట అమ్రాబాద్ అడవుల్లో ఇద్దరు చెంచులు తేనే తీసేందుకు వెళ్లి.. లోయలో పడి ప్రాణాలు కోల్పోతే రాత్రి 10గంటలు దాటినా నేరుగా.. సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. రాత్రి ఆలస్యమైనా తెల్లవారి 5 గంటలకే మరో గ్రామంలో ప్రత్యక్ష మయ్యారు. ఇలా ఆకస్మిక పర్యటనలు చేస్తూ.. అధికారులను ఉరుకులు,పరుగులు పెట్టిస్తున్నారు

క్షేత్రస్థాయి పర్యటనల్లో మాత్రమే కాదు.. పరిపాలనలోనూ తనదైన శైలి అనుసరిస్తున్నారు. ఉదయం ఎక్కడికి వెళ్లినా.. ఉదయం పదిన్నర 11 గంటల కల్లా కలెక్టరేట్ లో అందుబాటులో ఉంటారు. క్షేత్రస్థాయి పర్యటనలు లేకపోతే.. సాయంత్రం ఐదున్నర వరకూ కార్యాలయంలోనే గడుపుతున్నారు. క్యాంపుఆఫీసు మీటింగ్ లకు మంగళం పాడారు. జిల్లా స్థాయి అధికారులు జిల్లా కేంద్రాన్ని విడిచి వెళ్తే తప్పకుండా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.

ఇక గ్రామ కార్యదర్శులు, పారిశుద్య సిబ్బంది గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచే విధుల్లో ఉండాలని ఇటీవలే సర్కులర్ జారీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు సైతం స్థానికంగానే ఉండాలని చెప్పిన శర్మన్.. వారి చిరునామాలు ఏమిటో 15 రోజుల్లో చెప్పాలని సైతం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

నాగర్ కర్నూల్ జిల్లాలో కలెక్టర్ శర్మన్ ఆకస్మిక పర్యటనలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. కలెక్టర్ శైలి..కేవలం అధికారులనే పరుగులు పెట్టిస్తుందా? పల్లె, పట్టణాల్లో ప్రగతిని సైతం పరుగులు పెట్టిస్తుందా ? వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి-నిఘా నీడలో: స్వాతంత్ర్య వేడుకలకు పటిష్ఠ భద్రత

ABOUT THE AUTHOR

...view details