ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస-భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ, లాఠీ ఛార్జ్‌కి దారి తీసింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా రాష్ట్ర ఇంఛార్జీ తరుణ్ చుగ్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. అదే సమయంలో అటు వైపు నుంచి వెళ్తున్న శాసనసభ్యుడు గువ్వల బాలరాజు వాహనం వచ్చింది. వాహనానికి అడ్డుతొలగాలంటూ తెరాస కార్యకర్తలు భాజపా కార్యకర్తలను నెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులపై లాఠీఛార్జ్ చేశారు.
ఈ ఘటనలో ఆరుగురు భాజపా కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో స్వల్ఫ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సహా తెరాస తీరును నిరసిస్తూ భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.