శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రమాదానికి కారణాలపై ఉన్నతాధికారుల దర్యాప్తు ప్రారంభమైంది. ఘటనపై విచారణకు ఎలక్ట్రికల్, ఫోరెన్సిక్‌సైన్స్, సీఐడీ, స్థానిక పోలీసుల బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అగ్నిప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరగడం వల్ల... ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. దుర్ఘటనకు దారి తీసిన పరిస్థితులు, ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని స్పష్టంచేశారు. అందులో భాగంగా సీఐడీ అధికారుల బృందం... శ్రీశైలం జలవిద్యుత్‌కేంద్రాన్ని సందర్శించింది.
తొలుత ఈగలపెంటలోని జెన్‌కో అతిథిగృహంలో సీఈ, డీఈ, ఈఈ స్థాయి అధికారులతో సమావేశమై.... ఘటన జరిగిన తీరు, ప్రమాదానికి కాణమైన పరిస్థితులు ఇతర అంశాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అక్కడి నుంచి భూగర్భంలో ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. సొరంగంలో అవకాశం ఉన్నంత మేర లోపలికి వెళ్లి... అత్యవసర మార్గాలన్నింటినీ పరిశీలించారు.