ఆహార ఉత్పత్తుల కోసం వెళ్లిన చెంచు గిరిజనులు అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటల్లో చిక్కుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో చోటుచేసుకుంది. ఆమ్రబాద్ మండలం ఫరహబాద్ చెక్ పోస్టు నుంచి 13 కిలో మీటర్ల దూరంలోని మల్లాపూర్ చెంచుపెంట సమీపంలో మంటలు అంటుకొని ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న 108 సిబ్బంది ఒక్కసారిగా గాలి వీచి..
మల్లాపూర్ పెంటకు చెందిన 11మంది చెంచులు ఆహార ఉత్పత్తుల సేకరణకు వెళ్లి వస్తున్న క్రమంలో లోయ ప్రాంతంలో ఒక్కసారిగా గాలి వీచి మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకున్నారు. వారిలో నలుగురు తప్పించుకోగా.. ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక వ్యక్తి గ్రామానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించాడు.
పరిస్థితి విషమం..
పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఏడుగురిని వైద్యులు పరీక్షించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. ఇద్దరికి తీవ్రంగా, నలుగురికి సాధారణ గాయాలయ్యాయని తెలిపారు.
మెరుగైన వైద్యం కోసం నలుగురిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి, ఇద్దరిని మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. బాధితులను జిల్లా అదనపు కలెక్టర్ మను చౌదరి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు పరామర్శించారు.
ఇదీ చూడండి:విమెన్స్ డే స్పెషల్: ఆమె సేవలకు సలాం... జాతీయ పురస్కారం సైతం గులాం...