కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే మిగిలాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(BANDI SANJAY) అన్నారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. నాగర్‌కర్నూల్ జిల్లా భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా సమయంలో ప్రజలను పట్టించుకోకుండా.. రాజకీయ ఎత్తుగడలు ప్రదర్శించారని మండిపడ్డారు. ప్రజలను కొవిడ్ అంశం నుంచి మళ్లించడానికే ఈటల డ్రామాను కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. అబద్ధపు మాటలు, నెరవేర్చలేని హామీలతో కేసీఆర్ పాలన సాగుతోందని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో ప్రజలు విసిగిపోతున్నారని బండి సంజయ్(BANDI SANJAY) పేర్కొన్నారు. భాజపా పెట్టిన పొగతోనే.... కేసీఆర్ ఫాంహౌస్ వదిలి... ప్రజల్లోకి వస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ ప్రకటనలు, నిరుద్యోగ భృతిపై ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కొలువులు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస ప్రజాప్రతినిధులను యువతరం నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ తన హామీ ఎందుకు నెరవేర్చలేదు. నోటిఫికేషన్ ఇస్తానని ప్రకటించి ఎందుకు వెనకడుగేశారు. రాష్ట్రంలో మంత్రుల పరిస్థితి యథారాజ తథా ప్రజ అన్న చందంగా ఉంది. 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఎవరికిచ్చారో లెక్క చెప్పాలి. కరోనా సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. పేదల కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఇప్పటికి సగం మందికి కూడా ఇవ్వలేకపోయారు. పాత్రికేయులకు రెండు పడక గదుల ఇళ్లు అందజేస్తామన్నారు. ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని ప్రధాని మోదీ చెప్తే కనీసం కృతజ్ఞత కూడా చెప్పలేని సంస్కారం కేసీఆర్‌ది. ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు.
- బండి సంజయ్(BANDI SANJAY), భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
2023లో అన్ని రాష్ట్రాల్లో భాజపా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్(BANDI SANJAY) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గడీల పాలనకు వ్యతిరేకంగా ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర భాగ్యనగరంలోని భాగ్యలక్ష్మీ ఆలయం నుంచే మొదలవుతుందని స్పష్టం చేశారు. కాషాయ శ్రేణులు, ప్రజలు కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా చేస్తున్న ఈ పాదయాత్రకు మద్దతు పలకాలని బండి కోరారు.
భాజపా పెట్టిన పొగతోనే ప్రజల్లోకి సీఎం కేసీఆర్