తెలంగాణ

telangana

ETV Bharat / state

ఊరుకొండలో బ్రహ్మోత్సవాలు... ఆంజనేయునికి నిత్యపూజలు

ఊరుకొండ పేట అభయాంజనేయస్వామి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. దీనజన బాంధవుడిగా ఆరాధిస్తున్న ఆంజనేయస్వామి ఆలయం ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 6 (శనివారం) నుంచి ప్రారంభం కానున్న జాతరకు దేవాదాయ శాఖ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సదుపాయాలను కల్పిస్తున్నామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

By

Published : Feb 5, 2021, 12:37 PM IST

anjaneya-swamy-brahmotsavalu-at-urkondapeta-in-nagarkurnool-district
ఊరుకొండలో బ్రహ్మోత్సవాలు... ఆంజనేయునికి నిత్యపూజలు

నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట గ్రామ శివారులో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయం అతి పురాతనమైనది. కల్వకుర్తి నుంచి మహబూబ్​నగర్ వెళ్లే దారిలో ఊరుకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఊరుకొండ పేట గ్రామ శివారులో రెండు కొండల మధ్య ఆలయం వెలసింది.

ఉత్సవాల నిర్వహణ...

ఈనెల 6వ తేదీ నుంచి 13 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి రామేశ్వర శర్మ తెలిపారు. ఉతవ్సాల్లో భాగంగా శనివారం ఉదయం కృష్ణమూర్తి నివాసం నుంచి... ఉత్సవ మూర్తిని పల్లకీలో ఆలయ ప్రవేశం చేయిస్తారు. అనంతరం ధ్వజారోహనం, మూల విరాఠ్‌కు పంచామృతాభిషేకం, నూతన వస్త్రధారణ, వెండి ఆభరణాల అలంకరణ, సహస్ర నామార్చన, శకటోత్సవం నిర్వహించనున్నారు. 7వ తేదీన ఉదయం పంచసూక్తములతో పూజలు, సహస్ర నామార్చన, గజవాహన సేవ, భజనలు, ప్రదోష పూజలు... 8న రాత్రి రథోత్సవం, 9న అష్టోత్తర నామావళి, మంగళహరతీ, మంత్ర పుష్యము, రాత్రి పల్లకీ సేవ, హరికథ కాలక్షేపం, 10న ఉదయం ఉత్సవ మూర్తులకు పంచమృతాభిషేకం, రాత్రి వాహన సేవ, 11న ఉదయం అభిషేకములు, అర్చనలు, రాత్రికి నెమళి వాహన సేవ, గ్రామ భజన మండలితో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12వ తేదీన రాత్రి పల్లకీ సేవ, 13న ఉదయం 11 గంటలకు చక్రస్నానం, సాయంత్రం ఆరు గంటలకు దేవాలయం నుంచి ఊర్కొండపేటలోని కృష్ణ మూర్తి నివాసానికి ఉత్సవ మూర్తి తరలింపుతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నట్లు కార్య నిర్వహణ అధికారి తెలిపారు.

ఆలయ విశిష్ఠతలు..

ఈ ఆలయంలో స్వామివారి ప్రతిమామూర్తి ఆరడుగుల ఎత్తుతో కాళికా వర్చస్సుతో ఉంటుంది. స్వామికి సింధూర లేపనం సైతం ఉండదు. ఎత్తైన గర్భగుడి.. విశాలమైన ఆలయ సముదాయం రాజదర్బారును తలపిస్తోంది. అర్చకులు స్వామి వారికి నిత్య పూజలతో పాటు... ప్రత్యేక అలంకరణలు చేస్తారు.

ఎత్తైన శంకరుడి విగ్రహం...

ఆలయ ప్రాంగణంలో సుమారు 40 అడుగుల ఎత్తులో శంకరుడు విగ్రహం భక్తులకు కనువిందు చేస్తుంది. రథోత్సవాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన రథం ఆకట్టుకునేలా ఉంటుంది. స్వామి వారికి ప్రతి సంవత్సరం పుష్య బహుళ అమావాస్య తిథుల ప్రకారం ఉత్సవాలు జరుపుతారు. రథోత్సవం, శకట ఉత్సవం వంటి ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుంచి సైతం భక్తులు భారీగా తరలి వస్తారు. ఆలయం ఎదుట ఉన్న గుట్టలపైనున్న కొనేరులో నీరు నిరంతరం ఉంటుంది. ప్రతి శని, మంగళవారాలు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి వ్రతాలు, వాహన పూజలు చేయిస్తుంటారు.

ఇదీ చూడండి:'రైల్వే ఓవర్‌ బ్రిడ్జిల కంటే పురాతన వృక్షాలే మేలు

ABOUT THE AUTHOR

...view details