Anganwadi Centers Problems in Nagarkurnool : బాల్యానికి ఆహార భద్రత కోసం, తల్లీపిల్లలకు పౌష్ఠికాహారం అందించడం కోసం నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో అవస్థలు పడుతున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో వీటి నిర్వహణలో అలవికాని నిర్లక్ష్యం తాండవిస్తోంది. ప్రభుత్వం, అధికారులు అంగన్ వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణాల్ని కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ చిన్నారులు, బాలింతలకు అందించే విద్య, పౌష్ఠికాహార సేవలు సైతం మొక్కుబడిగానే సాగుతున్నాయి. వేసవిలో కనీస వసతులు కొరవడ్డంతో ఈ కేంద్రాలకు హాజరయ్యే చిన్నారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రెండు, మూడు కేంద్రాలను ఒకేచోట నిర్వహిస్తున్నారు. కొన్ని భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. సగానికి పైగా కేంద్రాలకు పక్కా భవనాలు లేవు. ఎక్కువ శాతం అద్దె భవనాలు, రేకుల షెడ్లలోనే నిర్వహిస్తున్నారు. దీంతో ఈ కేంద్రాలకు పిల్లల హాజరు శాతం తగ్గుతోంది.
11 అంగన్వాడీలుంటే.. 10 అద్దెవే..: జిల్లాలో 371 కేంద్రాల్లో పెరటి తోటలు పెంచాలని నిర్ణయించినా.. చాలాచోట్ల అమలు కావట్లేదు. నాగర్‌కర్నూల్ పట్టణంలో 11 అంగన్‌వాడీ కేంద్రాలుంటే.. వాటిలో 10 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. సంజయ్ నగర్ కాలనీలో ఉన్న ఒక్క భవనానికి సైతం నీటి సరఫరా లేదు. దీంతో మరుగుదొడ్డి వసతి, కరెంటు సౌకర్యం లేదు. ఇక్కడ వంటలు చేయడానికి అనువైన స్థలమూ లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. పిల్లలకు కేటాయించిన ఆట వస్తువులు సైతం తుప్పు పట్టాయంటున్నారు. పరిసరాల్లో పరిశుభ్రత లోపించడంతో పిల్లలు అక్కడికి రావడానికి జంకుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ జిల్లాలోని బిజినేపల్లి మండలం వెలుగొండలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలుంటే.. భవనంలో పైకప్పు పెచ్చులూడి పడిపోయింది. దీంతో ఈ భవనానికి తాళం వేశారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల కొనసాగుతోంది. జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీలు, భవనాల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు సీడీపీవో తెలిపారు.