తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది

ప్రతిభకు కొలమానంలేదు... పట్టుదలకు అవరోధం ఉండదని నిరూపించాడో యువకుడు. కలలు కనడమే కాదు వాటిని సాకారం చేసుకోవాలనే పట్టుదలతో అసాధ్యమనుకున్నది సాధించి చూపించాడు. పెట్రోల్​ లేకుండా బ్యాటరీపై నడిచే హైబ్రిడ్​ బైకును తయారు చేసి ఔరా అనిపించాడు నాగర్​కర్నూల్​ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్​.

ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది

By

Published : Jul 24, 2019, 8:03 AM IST

నేటి రోజుల్లో మోటర్​ సైకిల్​ మనిషి జీవితంలో ఓ భాగం. బైకు లేకుండా గడపదాటాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. పెట్రోలు ధరల మంటలకు భయపడి బండి తీయడానికి వెనకాడుతున్న పరిస్థితి. బైకుందని గాలికి తిరిగితే జేబుకు చిల్లుపడుతోంది. దీనికి పరిష్కారం అన్వేషిస్తూనే కాలుష్యరహితంగా బ్యాటరీతో నడిచే మోటర్​ సైకిల్​ రూపొందించాడు నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రానికి చెందిన గణేష్​. ప్రస్తుతం విఫణిలో బ్యాటరీతో నడిచే స్కూటీలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. కానీ బైకుల్లేవు.. అందుకోసమే బ్యాటరీతో నడిచే బైకును తయారు చేశాడు. దీనికి టూ ఇన్​ వన్​ హైబ్రిడ్​ బైక్​ అని పేరు పెట్టాడు.

ఆలోచన వచ్చిందిలా..

తన పాత పల్సర్​ బైకును అమ్మేసి బ్యాటరీతో నడిచే స్కూటీ కొందామని ఓ షోరూంకు వెళ్లాడు గణేష్​. కానీ అది గంటకు 40 కిమీ వేగం మించి వెళ్లదని ఆలోచన విరమించుకున్నాడు. తన బైకుకే బ్యాటరీ అమిర్చితే ఎలా ఉంటుందనే ఆలోచనతో అంతర్జాలంలో వెతికి తానే స్వయంగా తయారు చేసుకోవాలనుకున్నాడు. ముంబయి వెళ్లి ఓ ఇంజినీరు సహాయంతో రూ.70 వేలు వెచ్చించి బైకుకు కావాల్సిన సామగ్రి తెచ్చి సొంతంగా తన పల్సర్​ బైకుకు బ్యాటరీ బిగించాడు. దీనికి ఎలాంటి మెయింటినెన్స్​ అక్కరలేదు. ఇంజిన్​ ఆయిల్​, గేర్​ మార్చుకోవడం, సైలెన్సర్​ వంటివి అవసరం లేదు. కేవలం ఛార్జింగ్​ పెట్టుకుని నడుపుకోవడమే.

రెండు గంటల ఛార్జింగ్​... 60 మైళ్ల ప్రయాణం

ఈ బైక్​ పెట్రోలు, బ్యాటరీతోనూ పనిచేస్తోంది. రెండు గంటలు ఛార్జింగ్​ పెడితే గంటకు 40 కిమీ వేగంతో 60 మైళ్లు దూసుకుపోవచ్చని తెలిపాడు. 60 కిమీ వేగంతో అయితే 40 మైళ్లు వెళ్లొచ్చంటున్నాడు. కేవలం ఒక స్విచ్​ నొక్కి పెట్రోల్​తో కూడా ఈ టూ ఇన్​ వన్​ బైకుపై దూసుకుపోవచ్చంటున్నాడు గణేష్​. ఈ వాహనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపాడు. ఎలాంటి ధ్వని కాలుష్యం ఉండదు. ఆలోచనను ఆచరణలో పెడితే దాని సత్పలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ప్రయోగం ఓ చక్కటి ఉదాహరణ. యువత తలచుకుంటే సాధించలేనిదేదీ లేదనడానికి ఇదో గీటురాయి.

ఆలోచన అదిరింది.... బ్యాటరీ బైక్​ వచ్చింది
ఇదీ చూడండి: తండ్రికి సాయం... ఆవిష్కరణకు ఊతం...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details