తెలంగాణ

telangana

ETV Bharat / state

నల్లమలలో 25 సెంటీమీటర్ల పొడవైన అరుదైన సర్పం

నల్లమల అటవీ ప్రాంతం సకల జీవరాశులకు నెలవు. టైగర్​ రిజర్వ్​ ఫారెస్ట్​గా పేరుగాంచిన ఆ ప్రాంతంలో అన్ని రకాల జంతువులు, కీటకాలు, సరీసృపాలు మనకు దర్శనమిస్తాయి. నాగర్ కర్నూల్​ జిల్లా ఆమ్రాబాద్​ అటవీప్రాంతంలో ఓ అరుదైన సర్పం కనిపించింది. మిలమిల మెరుస్తూ ఉండే ఆ పాము కేవలం 25 సెంటీమీటర్లు పొడవు మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకమైన పామును షీల్డ్​టైల్ అని పిలుస్తారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

A rare snake found nallamala forest in near domalapenta in nagar kurnool district
నల్లమలలో 25 సెంటీమీటర్ల పొడవైన అరుదైన సర్పం

By

Published : Feb 22, 2021, 10:33 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విస్తరించి.. ఎన్నో విశిష్టతలకు నెలవైన నల్లమలలో అరుదైన సర్పం కనిపించింది. నాగర్ కర్నూల్​ జిల్లా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్​ అటవీ ప్రాంతంలోని దోమలపెంట రేంజ్​ పరిధిలో తొలిసారిగా ఈ పామును గుర్తించారు. యూరోఫెల్టిడే కుటుంబానికి చెందిన 'యూరోఫెల్టిస్​ ఎలియోటి' అనే శాస్త్రీయనామంతో పిలిచే షీల్డ్​టైల్​ సర్పమని బీట్​ అధికారి మధుసూదన్​ తెలిపారు.

పాము శరీరంపై ముదురు, గోధుమరంగు, తల, తోకలపై పసుపపచ్చ మచ్చలు ఉండడంతో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా కనిపించని అరుదైన పాము అని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్​ సదాశివయ్య తెలిపారు. కేవలం 25 సెంటీమీటర్ల పొడవుండే ఈ పాములు రాత్రివేళల్లో మాత్రమే సంచరిస్తూ వానపాములను తిని జీవిస్తాయని చెబుతున్నారు. విషరహితమైన ఈ సర్పాలు పక్షులు, అడవిపందులకు ఆహారంగా ఉపయోగపడతాయని ఆయన వెల్లడించారు. తేమ ప్రాంతాల్లో భూమిలో రంధ్రాలు చేసుకుని జీవిస్తాయని చెప్పారు.

ఇదీ చూడండి :న్యాయవాదుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details