నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్న భోజనం అనంతరం అరగంట వ్యవధిలోనే విద్యార్థులందరూ తీవ్ర వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, తలనొప్పికి గురయ్యారు. ఉపాధ్యాయులు వారిని నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మొత్తం పాఠశాలలో 170 మంది విద్యార్థులు ఉండగా 40 మంది ఆస్పత్రి పాలయ్యారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మధ్యాహ్నం వంకాయకూరతో భోజనం చేసినట్లు విద్యార్థులు చెప్పారు. ఫుడ్ పాయిజన్ నీటి ద్వారానో.. లేదంటే తిన్న ఆహారం ద్వారానో జరిగి ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు విషయం తెలియకుండా ఆస్పత్రికి తరలించడంపై ఆస్పత్రి వద్ద వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.