ములుగు జిల్లా తాడ్వాయి మండలం లింగాలలో వైఎస్ఆర్టీపీ వ్యవస్థపక అధ్యక్షురాలు షర్మిల గురువారం పోడుయాత్ర చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు పాల్గొని.. విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా ఇంఛార్జీ శ్రీనివాసరెడ్డి కోరారు. రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల్లో పోడుభూమి సాగు అవుతుందని చెప్పారు. పోడు భూముల పట్టాల విషయంలో లక్షకుపైగా దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు.
గోవిందరావుపేట మండలం పస్రాలో శ్రీనివాస రెడ్డి మంగళవారం పర్యటించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల విషయంలో ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదన్నారు. గ్రామాల్లో నేనే ప్రజాదర్బార్ నిర్వహించి పోడు సమస్యలను పరిష్కరిస్తానని నమ్మబలికిన కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదన్నారు. లక్షలాది మంది గిరిజనులు తాము సాగు చేసుకుంటున్న భూములు ఎప్పుడు ఏమవుతాయోనన్న భయంతో జీవిస్తున్నారని చెప్పారు.