తెలంగాణలో గిరిజనులకు గుంట భూమి లేని పరిస్థితి నెలకొందని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చి..….రైతుబంధు, రైతు బీమా వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా లింగాల గ్రామంలో పర్యటించిన ఆమె... పోడు రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.
అంతకు ముందు గోవిందరావుపేట మండలం పసరలో కుమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి లింగాల గ్రామానికి కాలినడకన వెళ్లారు. పోడు రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు చేసుకున్న రైతులు లక్షలాది మంది రైతులకు వైఎస్‌ఆర్ హాయాంలో పట్టాపాసుపుస్తకాలు ఇచ్చారని పేర్కొన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజనులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు దగ్గరుంది పట్టా పాస్ పుస్తకాలు ఇప్పిస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. గిరిజనులకు గుంట భూమి లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చి రైతుబంధు, రైతు బీమా వర్తించేలా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన రైతుల పక్షాన పోరాటం చేస్తానన్నారు.